మావాడు వైభవ్‌ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్‌ కెప్టెన్‌ | Japan Captain Blunt Warning To Vaibhav Sooryavanshi Before Historic Clash | Sakshi
Sakshi News home page

మావాడు ఇప్పటికే వైభవ్‌ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్‌ కెప్టెన్‌

Sep 14 2026 3:27 PM | Updated on Sep 14 2026 3:49 PM

Japan Captain Blunt Warning To Vaibhav Sooryavanshi Before Historic Clash

వైభవ్‌ సూర్యవంశీ (PC: BCCI X)

టీమిండియాతో చారిత్రక మ్యాచ్‌ ఆడేందుకు జపాన్‌ క్రికెట్‌ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌ కెప్టెన్‌ కెండెల్‌ కడోవాకీ ఫ్లెమింగ్‌.. భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విధ్వంసకర ఓపెనర్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు తమ దగ్గర అస్త్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు.

భారత్‌- జపాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇరుదేశాల పురుషుల క్రికెట్‌ జట్ల మధ్య తొలిసారి మ్యాచ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 22న ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌ జరుగనుంది. జపాన్‌లోని సానో అంతర్జాతీయ మైదానం ఇందుకు వేదిక.

ఇప్పటికే వైభవ్‌ను ఓసారి అవుట్‌ చేశాడు
ఈ నేపథ్యంలో జపాన్‌ కెప్టెన్‌ కెండెల్‌ ‘విజ్డెన్‌’ షోలో మాట్లాడుతూ.. ‘‘వైభవ్‌ సూర్యవంశీని ఎదుర్కొనే విషయంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు. ఎందుకంటే.. మా జట్టులో ఉన్న పదిహేడేళ్ల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆసియా కప్‌ అండర్‌-19 టోర్నీలో ఇప్పటికే వైభవ్‌ను అవుట్‌ చేశాడు. దూకుడుకు కళ్లెం వేసి అతడి పనిపట్టాడు. కాబట్టి ఇంకేం భయం?’’ అని పేర్కొన్నాడు.

చార్లీ హరా బౌలింగ్‌లో
కాగా అండర్‌-19 ఆసియా కప్‌-2024 టోర్నీలో భాగంగా జపాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా పరుగులు రాబట్టేందుకు వైభవ్‌ సూర్యవంశీ ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 23 పరుగులే చేయగలిగాడు. భారత ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో జపాన్‌ యువ స్పిన్నర్‌ చార్లీ హరా-హింజే వైభవ్‌ను అవుట్‌ చేశాడు.

అంత ఈజీ కాదు.. కథ వేరుగా ఉంది
అయితే, జపాన్‌ కెప్టెన్‌ కెండెల్‌ చెప్పినట్లు వైభవ్‌ సూర్యవంశీని తమ యువ స్పిన్నర్‌తో కట్టడి చేయడం అంత తేలికేమీ కాదు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ స్సిన్నర్ల బౌలింగ్‌లో 17 ఇన్నింగ్స్‌లో కలిపి 146 బంతుల్లో 336 పరుగులు సాధించాడు. సగటు 37 కాగా.. స్ట్రైక్‌రేటు 228.08. ఇందులో 20 ఫోర్లు, 34 సిక్సర్లు ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ.. 193 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 

ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 23 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 1028 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. సంజూ శాంసన్‌ రాక వల్ల తొలి టీ20 సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

చదవండి: వైభవ్‌ను కాదని నీకు ఛాన్స్‌  ఇస్తే ఏం చేశావు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement