PC: SA Twitter
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గాయాల వల్ల స్టార్ పేసర్లు కగిసో రబాడా, ఒట్నీల్ బార్ట్‌మన్‌లు దూరం కాగా.. తాజాగా స్పీడ్‌స్టార్ లుంగి ఎంగిడి కూడా ఈ జాబితాలో చేరాడు. కుడి కాలి తొడ కండరాల గాయం కారణంగా అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ఈ నెల ఆరంభంలో డాల్ఫిన్స్‌తో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున ఆడుతున్న సమయంలో ఎంగిడి గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడిన అతడికి ఆస్పత్రిలో స్కాన్ నిర్వహించగా గాయం తీవ్రత బయటపడింది. వైద్యులు అతడికి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆసీస్‌తో వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
ఎంగిడి స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్ న్కోబాని మోకోయెనాను ప్రొటీస్ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రబాడా, బార్ట్‌మన్, ఎంగిడి వంటి కీలక పేసర్లు లేకుండా సౌతాఫ్రికా యువ బౌలింగ్ విభాగం పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, న్కోబానీ మోకోనా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.
చదవండి: IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!?


