పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం | South Africa Seal 99 Run Victory Over Namibia Via DLS Method In Rain Hit ODI, Check Details Inside | Sakshi
Sakshi News home page

పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం

Sep 10 2026 7:42 AM | Updated on Sep 10 2026 9:13 AM

South Africa wins by 99 runs via DLS method

PC: X

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వన్డేలో నమీబియాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 99 పరుగుల తేడాతో గెలిచింది. ఇటీవల జరిగిన ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా... బుధవారం నమీబియాతో తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిరీ్ణత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఓపెనర్‌ జోర్డాన్‌ హెర్మన్‌ (126 బంతుల్లో 150; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. టోనీ డి జోర్జి (84 బంతుల్లో 72; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అతడికి అండగా నిలిచాడు. 

వీరిద్దరూ రెండో వికెట్‌కు 190 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. హెర్మన్‌ అరంగేట్ర వన్డేలో సెంచరీ చేసిన ఐదో దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు కొలిన్‌ ఇంగ్రామ్, తెంబా బవుమా, రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీజ్కె ఈ ఘనత సాదించారు. డెవాల్డ్‌ బ్రేవిస్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కార్బిన్‌ బాష్‌ (39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ 68 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం వాటిల్లింది. ఆ తర్వాత మైదానం సిద్ధంగా లేకపోవడంతో ఆట తిరిగి ప్రారంభమయ్యేందుకు ఆలస్యమైంది. దీంతో నమీబియా లక్ష్యాన్ని 31 ఓవర్లలో 262 పరుగులుగా నిర్దేశించారు. ఛేదనలో నమీబియా 31 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులకు పరిమితమైంది. 

మలన్‌ క్రుగెర్‌ (60 బంతుల్లో 34; 1 ఫోర్‌), జేజే స్మిత్‌ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో ప్రెనేలన్‌ సుబ్రాయెన్‌ 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.
చదవండి: ఇప్పుడు టి20 శైలికి మారిపోతా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement