source: X
సౌతాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. నమీబియాతో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో 24 ఏళ్ల హెర్మన్ భారీ సెంచరీతో కదంతొక్కాడు. తద్వారా తన దేశానికే చెందిన సహచర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీతో కలిసి వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో హెర్మన్ 126 బంతుల్లో 150 పరుగులు (17 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. బ్రీట్జ్కీ 2025 ఫిబ్రవరి 10న న్యూజిలాండ్‌తో లాహోర్‌లో జరిగిన తన వన్డే అరంగేట్రంలో 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. వన్డే అరంగేట్రంలో బ్రీట్జ్కీ, హెర్మన్ మినహా ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. ఈ ఘనత సాధించిన ఇద్దరూ సౌతాఫ్రికన్లే కావడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 27 పరుగులకే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హుయిజన్ (10) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అయిన హెర్మన్, టోనీ డి జోర్జి (72) కలిసి భారీ స్కోర్‌కు బలమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 166 బంతుల్లో 190 పరుగులు జోడించారు.
అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత సౌతాఫ్రికా స్కోర్ కాస్త నెమ్మదించింది. స్వల్ప వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబాటుకు లోనైంది. అయినా 47వ ఓవర్‌లో 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. 46.4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 302-5గా ఉంది. జేసన్ స్మిత్ (4), కార్బిన్ బాష్ (7) క్రీజ్‌లో ఉన్నారు. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపల్‌మన్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి వన్డేనే ఇది. దీనికి ముందు నమీబియాలోనే జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాక్


