చ‌రిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్‌.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు | Ishan Kishan Makes History, Becomes First Batter To Score 350 Runs In Duleep Trophy Match, Check More Details | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్‌.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు

Sep 10 2026 8:54 AM | Updated on Sep 10 2026 9:59 AM

Ishan Kishan Rewrites Duleep Trophy Record Books With 350 Runs In Final

PC: bcci

చెపాక్ వేదిక‌గా సౌత్ జోన్‌తో జ‌రుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైన‌ల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డ‌బుల్ సెంచ‌రీతో క‌దం తొక్కిన ఇషాన్‌(270).. రెండో ఇన్నింగ్స్‌లో వ‌న్డే త‌ర‌హాలో మెరుపులు మెరిపించాడు. కేవ‌లం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 80 ప‌రుగులు చేశాడు.

ఈ భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 350 ప‌రుగులు చేశాడు. త‌ద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా కిషన్ నిలిచాడు. ఇంత‌కుముందు భార‌త మాజీ క్రికెట‌ర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదిక‌గా వెస్ట్ జోన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్‌ సాధించాడు. తాజా నాక్‌తో లంబాను అధిగమించి కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అడుగు దూరంలో
ఇక ఈ ప్ర‌తిష్టాత్మ‌క దులీప్‌ ట్రోఫీని ఈస్ట్‌ జోన్‌ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్‌ ఓవరాల్‌గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్‌ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందుకున్న ఈస్ట్‌ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌ జోన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది.  

తిలక్‌ వర్మ 99 
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్‌ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్‌’ ఇవ్వకుండా ఈస్ట్‌ బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్‌ సూర్యవంశీ (8), ఈశ్వరన్‌ (3) విఫలమైనా...ఇషాన్‌ కిషన్, శిఖర్‌ మోహన్‌ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.
చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement