source: X
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరో మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటి, మ్యాచ్ మొత్తంలో 300 పరుగులు పూర్తి చేశాడు. త్రిపురణ విజయ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు.
నాలుగో రోజు టీ విరామం సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 48, శిఖర్ మోహన్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్, త్రిపురణ విజయ్‌కు తలో వికెట్ దక్కింది.
తృటిలో సెంచరీ చేజార్చుకున్న తిలక్
అంతకుముందు తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేయడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్‌కు చామ మిలింద్ (43) సహకరించడంతో సౌత్ జోన్ 300 పరుగుల మార్కును దాటగలిగింది.
దీనికి ముందు దేవ్‌దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్, తిలక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలో 2 వికెట్లు తీశారు.
ఇషాన్ డబుల్ ధమాకా
ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.
ఈస్ట్‌జోన్‌దే టైటిల్
సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది.
చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్


