Photo Credit: BCCI Twitter
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ అనంతరం టీమిండియా అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులతో పాటు ఐదు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కివీస్ గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నవంబర్ 19 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ కీలక బ్యాటర్ కానున్నాడని బౌల్ట్ జోస్యం చెప్పాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కివీస్ పిచ్‌లకు అనుగుణంగా ఉంటుందని, అందుకే కివీస్ టూర్‌లో భారత్ తురుపుముక్క అతడే అవుతాడని పేర్కొన్నాడు.
బౌల్ట్ మాట్లాడుతూ.. "న్యూజిలాండ్‌లో టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ప్రతీసారి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అయితే భారత్ ఎప్పుడూ ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వచ్చేది. కానీ ఈసారి భిన్నంగా అక్టోబర్-నవంబర్‌లో మా దేశంలో పర్యటించనుంది. ఆ సమయంలో దేశంలో వాతావరణం చల్లగా ఉండడంతో బ్యాటర్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి.
ఇది బ్యాటర్లకు మరింత సవాల్‌గా మారనుంది. నవంబర్‌లో టెస్టు సిరీస్ మొదలుకానుండంతో, అప్పటికే వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. ఇది బౌలర్లకు అనుకూలంగా మారి వికెట్‌కు సహకరించవచ్చు. అయితే గెలుపోటములు పక్కనబెడితే ఈ సిరీస్ మాత్రం అభిమానులకు ఒక మంచి ఫీస్ట్‌ను అందించనుంది అని ఖచ్చితంగా చెప్పగలను" అని చెప్పుకొచ్చాడు.
ఇక గతంలో బౌల్ట్, టిమ్ సౌథీ చాలా సంవత్సరాలు న్యూజిలాండ్ తరఫున కొత్త బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈసారి కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ రూర్కీ రూపంలో కివీస్ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. ఇక న్యూజిలాండ్‌లో భారత పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, నవంబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డేలు, నవంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది.


