బ్రాటిస్లావా (స్లొవేకియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఆరు పతకాలు లభించాయి. 76 కేజీల విభాగంలో 18 ఏళ్ల కాజల్ ధోచక్ పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో కాజల్ 7–0 పాయింట్ల తేడాతోజింగ్రూ సున్ (చైనా)పై విజయం సాధించింది. కాజల్ సెమీఫైనల్లో 6–0తో పైపర్ మెరిడిత్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 14–0తో ఎల్మీరా యాసిన్ (టర్కీ)పై, తొలి రౌండ్‌లో 8–0తో మియు తకయామ (జపాన్)పై గెలుపొందింది.
గత ఏడాది ఇదే ఈవెంట్‌లో కాజల్ 72 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. మరోవైపు తనూ శర్మ (72 కేజీలు), సవిత (62 కేజీలు), మాన్సి లాథెర్ (68 కేజీలు) రజత పతకాలు... తన్వీ (57 కేజీలు), కోమల్ (59 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో తనూ శర్మ 3–5తో చిసాటో యోషిద (జపాన్) చేతిలో, సవిత 2–12తో సకురా ఒనిషి (జపాన్) చేతిలో, మాన్సి 1–2తో చెన్‌లింగ్ సాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్‌లలో తన్వీ 10–4తో క్రాకోవ్‌స్కా (కెనడా)పై, కోమల్ 5–2తో ఇదా బలాజ్ (హంగేరి)పై నెగ్గారు.


