ఐదేళ్ల కాలానికి భారీ ఎత్తున నిధులు
ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో క్రీడల సంస్కృతిని పెంచేందుకు, ప్రాథమిక స్థాయిలో ప్రతిభను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ‘ఖేలో ఇండియా’కు రూపకల్పన చేసింది. ఇప్పటి వరకు ఏడుసార్లు నిర్వహించిన పోటీల ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ‘ఖేలో ఇండియా’ క్రీడల స్థాయిని మరింతగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్ కేటాయింపులతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా ఈ ‘న్యూ ఖేలో ఇండియా’ను సిద్ధం చేసింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూపొందించిన ఐదేళ్ల ప్రణాళికకు సంబంధించి ఇటీవలే కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీని వివరాలను ‘సాయ్’ అధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 2026–2031 కాలానికి సంబంధించి కేంద్రం ‘ఖేలో ఇండియా’ కోసం ప్రత్యేకంగా రూ.29,054 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 8 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇప్పటి వరకు దీని ద్వారా దాదాపు 3 వేల అథ్లెట్లకు ప్రయోజనం కలుగుతుండగా, మరో 10 రెట్లు ఎక్కువ మంది ఆటగాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
2036 ఒలింపిక్స్‌లో టాప్–10లో, 2048 ఒలింపిక్స్‌లో టాప్–5లో ఉండే లక్ష్యంగా తమ ప్రణాళిక ఉన్నట్లు ‘సాయ్’ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.హిమబిందు వెల్లడించారు. ‘దాదాపు ఏడాదిన్నర కాలంగా కొత్త ఖేలో ఇండియా పథకం రూపకల్పన కోసం పని చేస్తున్నాం. ప్లేయర్లు మాత్రమే కాకుండా ఆటతో సంబంధం ఉన్న అధికారులు, క్రీడా సంఘాలు, సమాఖ్యలు, శిక్షణా కేంద్రాల ప్రతినిధులతో సహా ఎంతో మందితో చర్చించిన తర్వాతే దీనిని తీసుకొచ్చాం. నిజానికి ఇప్పటివరకు ఖేలో ఇండియా పురోగతి సంతృప్తికరంగా ఉండటంతోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారీ మొత్తాన్ని కేటాయించింది.
ఇప్పటి వరకు బడ్జెట్ అంటే చాలా వరకు స్టేడియాల నిర్మాణం వంటివాటికే ఉపయోగించారు. ఇప్పుడు ఆటగాళ్ల ట్రైనింగ్, ప్రతిభను గుర్తించి వారిని సానబెట్టేందుకు ఏర్పాట్లు, ప్రాధమిక స్థాయిలో కోచ్‌లు, పీఈటీల నియామకం తదితర కీలక విషయాలపై దృష్టి పెట్టాం. దిగువ స్థాయి నుంచి ఒలింపిక్ పతకం గెలిచే వరకు అన్ని దశల్లో ఈ కొత్త పథకంలో ప్రణాళికలు ఉన్నాయి. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం’ అని హిమబిందు వివరించారు. మున్ముందు విదేశీ కోచ్‌ల అవసరం లేకుండా మన దేశంలోనే అద్భుత వ్యవస్థ రూపుదిద్దాలని మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ‘సాయ్’ రీజినల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోనీబాలా దేవి కూడా పాల్గొన్నారు.


