శతక్కొట్టిన బ్యాటర్‌.. తమ వ‌న్డే చ‌రిత్ర‌లోనే రికార్డు ఛేదన | Milind Kumar-Century-USA-Beat-UAE-6 Wickets-ICC World Cup League | Sakshi
Sakshi News home page

USA Vs UAE: శతక్కొట్టిన బ్యాటర్‌.. తమ వ‌న్డే చ‌రిత్ర‌లోనే రికార్డు ఛేదన

Oct 6 2026 8:50 AM | Updated on Oct 6 2026 9:07 AM

Milind Kumar-Century-USA-Beat-UAE-6 Wickets-ICC World Cup League

Photo Credit: Twitter

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్‌-2 (2023-27)లో భాగంగా అమెరికా జట్టుకు ఆడుతున్న భారత్‌కు చెందిన మిలింద్‌ కుమార్‌ అజేయ సెంచరీతో మరోసారి వార్తల్లో నిలిచాడు. మిలింద్‌ శతకంతో అమెరికా 6 వికెట్ల తేడాతో యూఏఈపై విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో ముహమ్మద్ షెహదాద్ (107 బంతుల్లో 114 పరుగులు) సెంచరీ చేయగా, ఓపెనర్ తనీష్ సూరి (78) అర్థసెంచరీతో రాణించాడు. 

అమెరికా బౌలర్లలో హర్మీత్ సింగ్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 48.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (55) అర్థసెంచరీతో మంచి ఆరంభాన్ని ఇవ్వగా, మిలింద్ కుమార్ (84 బంతుల్లో 116 నాటౌట్‌, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభమ్ రంజానే (57 నాటౌట్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ షెహదాద్‌, అలీ నసీర్‌, ఇబ్రార్ అహ్మద్‌, అయాన్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.

త‌ద్వారా అమెరికా జ‌ట్టు త‌మ‌ వ‌న్డే చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. గ‌తంలో నేపాల్ విధించిన 294 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అమెరికా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించ‌డ‌మే ఇప్ప‌టివ‌ర‌కు అత్యుత్త‌మం. ఇక తాజా విజ‌యంతో లీగ్-2 పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ట్రై-సిరీస్‌లో మొదటి స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి ఆ జట్టుకు ఒక్క విజ‌యం మాత్ర‌మే అవ‌స‌రం. ఇక ఐసీసీ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ లీగ్-2లో తమ అద్భుతమైన ఫామ్ కారణంగా యూఎస్ఏ ఇప్పటికే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది జరిగే టోర్నమెంట్‌లో స్థానం సంపాదించే నాలుగు జట్లలో ఒకటిగా నిలవాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక మ్యాచ్‌లో ఐదు సిక్స‌ర్లు బాదిన మిలింద్ కుమార్ ఖాతాలో 38 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌ద్వారా అమెరికా త‌ర‌ఫున వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జాబితాలో మిలింద్ అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. మిలింద్ త‌ర్వాత మోనాంక్ ప‌టేల్ (34 సిక్స‌ర్లు) రెండో స్థానంలో ఉండ‌గా, ఆరోన్ జోన్స్ (32 సిక్స‌ర్లు) మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

ఇదీ చదవండి: WCL 2026: లెజెండ్స్‌ టోర్నీ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement