‘ఫిడే’ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఫిడే’ వరల్డ్ జూనియర్ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ డబుల్ ధమాకా మోగించింది. వెనెజువెలా వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఈథన్ వాజ్ పసిడి పతకంతో సత్తా చాటగా... మహిళల విభాగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ సవిత శ్రీ స్వర్ణం సాధించింది. ఓపెన్ విభాగంలో నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత గోవాకు చెందిన ఈథన్ వాజ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు.
15 ఏళ్ల 2 నెలల వయసులోనే ఈ టైటిల్ గెలిచిన ఈథన్.. ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 1988లో ఫ్రాన్స్ ప్లేయర్ జోయెల్ లాటియర్ (15 ఏళ్ల 5 నెలలు) నెలకొల్పిన రికార్డును 38 ఏళ్ల తర్వాత ఈథన్ బద్దలు కొట్టాడు. ఈ టోర్నీలో 8 రౌండ్‌లలో విజయాలు సాధించిన ఈథన్ వాజ్... ఒక గేమ్‌లో ఓడి... మరో రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఇదే విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఉప్పల ప్రణీత్ 8.5 పాయింట్లతో మూడో స్థానంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన సవితశ్రీ 9.5 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకోగా... నివేదిత (7.5 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. 2008లో ఓపెన్ కేటగిరీలో అభిజిత్ గుప్తా, మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక పసిడి పతకాలు సాధించిన తర్వాత రెండు విభాగాల్లో భారత ప్లేయర్లు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి.


