source: X
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2026లో ఇవాళ ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. డెజర్ట్ వైపర్స్- ఎంఐ ఎమిరేట్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో హైడ్రామా చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (57 బంతుల్లో 89 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), కుశాల్ పెరీరా (45 బంతుల్లో 76; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో డెజర్ట్ వైపర్స్ ముందు నుంచి తడబడుతూ వచ్చినప్పటికీ.. చివరి ఓవర్‌లో అనూహ్యంగా పుంజుకుని మ్యాచ్‌ను టై (186-6) చేసుకుంది. చివరి ఓవర్‌లో ఆ జట్టు గెలుపుకు 20 పరుగులు కావాల్సి ఉండగా.. అర్వింద్, ముజీబ్ రహ్మన్, ఖుజైమా తన్వీర్ అనూహ్యమైన పోరాటపటిమ కనబర్చి స్కోర్లను సమం చేశారు. ముఖ్యంగా తన్వీర్ చివరి రెండు బంతులను వరుసగా 6, 4కు తరలించి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.
సిక్సర్ కొట్టి గెలిపించిన పూరన్
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ ఘోరంగా విఫలమైంది. క్రిస్ జోర్డన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. 8 పరుగుల ఛేదనలో ఎంఐ కూడా తొలుత తడబడింది. తొలి 5 బంతుల్లో వికెట్ కోల్పోయి 3 పరుగులే చేసింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన తరుణంలో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించాడు.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ దిగ్గజం రిటైర్మెంట్.. ముహూర్తం ఖరారు


