ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) 2026 సీజన్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆల్‌రౌండర్ క్లోయ్ ట్రయాన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించింది. ఈ టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రయాన్.. శనివారం మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ విజయంతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్..
జంక్షన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 8.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ముందు 8 ఓవర్లలో 100 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించబడింది.
పీకల్లోతు కష్టాల నుంచి విజయతీరాలకు..
అనంతరం లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన క్లోయ్ ట్రయాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు బాది, మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు 5 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందించింది.
డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ట్రయాన్.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో సంయుక్తంగా రెండో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. గతంలో 2022 సీజన్‌లో టెస్ ఫ్లింటాఫ్ కూడా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. కాగా, ఈ జాబితాలో లారా హారిస్ (15 బంతులు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.


