న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్టులో సిరాజ్‌ను పక్కనపెట్టడంపై టీమ్ మేనేజ్‌మెంట్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో రెండో టెస్టులోనైనా అతనికి అవకాశం లభిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ మ్యాచ్‌లోనూ సిరాజ్‌కు బదులు పేసర్ గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో స్థానం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ పట్ల జట్టు యాజమాన్యం, సహచర ఆటగాళ్లు సానుభూతితో వ్యవహరించాలని అశ్విన్ సూచించాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిరాజ్‌కు మానసిక ధైర్యం ఎంతో అవసరమని, డ్రెస్సింగ్ రూమ్‌లో అతడి బాధను ఓపికగా వినే వ్యక్తి ఉండాలని అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కే అవకాశాలు కన్పించడం లేదు. పేసర్ల ప్రాధాన్యత క్రమంలో అతడు నితీశ్ కుమార్ రెడ్డి కంటే కూడా వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తోంది. సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడు. ఎవరైనా అతడితో మాట్లాడి తన ఆవేదనను పంచుకునే అవకాశం ఇచ్చి, సరైన దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను.
తదుపరి అవకాశం లభించినప్పుడు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు తీయడం ద్వారానే అతడు మళ్లీ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. గతంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పక్కనపెట్టి జట్టు యాజమాన్యం ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోందని, సిరాజ్‌కు ఇది ఏ మాత్రం సులువైన ముగింపు కాదు" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
చదవండి: IPL 2027: జస్ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయం!


