కెప్టెన్‌గా రోహిత్‌ రీఎంట్రీ.. ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు..? | 3 Changes Mumbai Indians Could Undergo With Rohit Sharma Back As Captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా రోహిత్‌ రీఎంట్రీ.. ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు..?

Nov 28 2026 4:19 PM | Updated on Nov 28 2026 4:27 PM

3 Changes Mumbai Indians Could Undergo With Rohit Sharma Back As Captain

source: IPL X

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించింది. హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌కు వెళ్లడంతో మూడేళ్ల విరామం తర్వాత రోహిత్‌కు మరోసారి నాయకత్వ బాధ్యతలు దక్కాయి.

రోహిత్‌ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ ఎనిమిది సీజన్లలో ఐదు టైటిళ్లు గెలిచి ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే రోహిత్‌ కెప్టెన్సీ నుంచి దిగిపోయాక ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అతడు కెప్టెన్‌గా రావడంతో జట్టు కూర్పు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలున్నట్లు ఆ ఫ్రాంచైజీ వర్గాలు అంటున్నాయి.

క్వింటన్‌ డికాక్‌తో కలిసి ఓపెనింగ్‌..?
ఐపీఎల్‌ 2026లో రోహిత్‌ శర్మతో కలిసి ర్యాన్‌ రికెల్టన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అయితే 2027 సీజన్‌లో రోహిత్‌ తన పాత ఓపెనింగ్‌ భాగస్వామి క్వింటన్‌ డికాక్‌తో బరిలోకి దిగే అవకాశముంది. ఐపీఎల్‌లో రోహిత్‌-డికాక్‌ జోడీ మంచి రికార్డు కలిగి ఉంది. వీరిద్దరూ కలిసి 37 ఇన్నింగ్స్‌ల్లో 34.29 సగటుతో 1269 పరుగులు చేశారు. ఈ గణాంకాల నేపథ్యంలో రికెల్టన్‌ కంటే డికాక్‌కే ఓపెనింగ్‌ స్థానంలో ప్రాధాన్యం దక్కవచ్చని అంచనా.

రూథర్‌ఫర్డ్‌కు మరిన్ని అవకాశాలు
వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌కు రోహిత్‌ కెప్టెన్సీలో ఎక్కువ అవకాశాలు దక్కవచ్చని భావిస్తున్నారు. ఐపీఎల్‌ 2026కు ముందు ముంబై ఇండియన్స్‌ అతడిని ట్రేడింగ్‌ ద్వారా జట్టులోకి తీసుకుంది. అయితే గత సీజన్‌లో అతన్ని కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే ఆడించారు. అందులో అతడు కేవలం 123 పరుగులే చేశాడు. గతంలో కీరన్‌ పొలార్డ్‌ వంటి వెస్టిండీస్‌ ఆటగాళ్ల సామర్థ్యాన్ని రోహిత్‌ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. అదే తరహాలో రూథర్‌ఫర్డ్‌కు కూడా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మెరుగైన స్థానం కల్పించి, తనను నిరూపించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వవచ్చని అంచనా.

మూడో స్థానంలో సూర్యకుమార్‌
ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌ తరచూ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చింది. దీంతో ఆటగాళ్లకు తమ పాత్రపై స్పష్టత లేకుండా పోయింది. రోహిత్‌ కెప్టెన్‌గా తిరిగి రావడంతో ఈ ప్రయోగాలకు స్వస్తి పలికి, బ్యాటర్లకు నిర్దిష్ట స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌ను మూడో స్థానంలో ఆడించే అవకాశముంది. ముంబై తరఫున ఆ స్థానంలో 65 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య 1899 పరుగులు చేశాడు.

మొత్తంగా రోహిత్‌ శర్మ తిరిగి కెప్టెన్‌గా రావడంతో ముంబై ఇండియన్స్‌ ఓపెనింగ్‌ జోడీ, మిడిల్‌ ఆర్డర్‌, బ్యాటింగ్‌ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. 

ఇదీ చదవండి: జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న నిర్ణ‌యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement