కొనసాగుతున్న వైఫల్యాల పరంపర.. బాబర్‌ ఆజమ్‌పై భారీ ట్రోలింగ్ | Poor Form Continues: Fans Lambast Babar Azam As Pakistan Icon Flops Again In ILT20 2026 | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైఫల్యాల పరంపర.. బాబర్‌ ఆజమ్‌పై భారీ ట్రోలింగ్

Nov 28 2026 8:43 PM | Updated on Nov 28 2026 8:54 PM

Poor Form Continues: Fans Lambast Babar Azam As Pakistan Icon Flops Again In ILT20 2026

source: X

ILT20 2026 సీజన్‌లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో బాబర్‌పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌ జరుగుతుంది. సొంత అభిమానులే అతడిని టార్గెట్ చేస్తున్నారు.

ఈ టోర్నీలో డెజర్ట్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బాబర్‌, తొలి మ్యాచ్‌లో షార్జా వారియర్జ్‌పై 51 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో జరిగిన పోరులోనూ నిరాశపరిచాడు (13 బంతుల్లో 11).

PSLలో సూపర్ ఫామ్
బాబర్‌ ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జల్మీకి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 73.50 సగటుతో 588 పరుగులు చేశాడు. స్వదేశీ లీగ్‌లో ఈ తరహాలో సత్తా చాటిన అతడు.. విదేశీ టీ20 లీగ్‌ల్లో మాత్రం తేలిపోతున్నాడు.

ఇదే ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున 11 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులే చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ILT20 2026లో ఒక్క మ్యాచ్‌ మినహా అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు.

సూపర్‌ ఓవర్‌లో ఎంఐ విజయం
ఇవాళ డెజర్ట్‌ వైపర్స్‌-ఎం ఎమిరేట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ద్వారా ఫలితం తేలింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ, అనంతరం ఛేదనకు దిగిన వైపర్స్‌ తలో 186 పరుగులు చేశాయి. సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి సిక్సర్‌ కొట్టి పూరన్‌ తన జట్టును గెలిపించుకున్నాడు. 

ఇదీ చదవండి: పూనకాలు తెప్పించిన పూరన్‌.. చివర్లో హైడ్రామా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement