అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురైనా, స్వదేశంలో న్యాయస్థానాలు కాదన్నా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను వేధించటానికే నిశ్చయించు కున్నట్టు కనబడుతోంది. తాజాగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ ఇచ్చిన నివేదిక (యూఎస్‌టీఆర్) మన దేశంతోపాటు చైనా, జపాన్ తదితర 14 దేశాలపై అదనపు సుంకాలు విధించాలని సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది అమలయ్యే ఈ సిఫార్సుల్లో మన దేశానికే కాస్త వెసులుబాటు దొరికినట్టు. కానీ దానికో మెలికవుంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతం సుంకాలు, లేనట్టయితే 25 శాతంపెంచాలని నివేదిక సిఫార్సు చేసింది.
మొన్నీమధ్యే ట్రంప్ చైనాలోని షెన్‌జెన్ పోయి చైనా, రష్యా అధినేతలతో త్రైపాక్షిక సమావేశం జరిపారు. ప్రపంచానికి ఒరిగిందేమీ పెద్దగా లేకపోయినా, కనీసం వాళ్ల ముగ్గురిమధ్యా ఏదో మేర అవగాహన కుదిరిందన్న అభిప్రాయం కలిగింది. కానీ పదిరోజులు దాటకుండానే ట్రంప్ సుంకాల అస్త్రం బయటికి తీశారు. గత అదనపు సుంకాలు చెల్లబోవని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునిచ్చాక మొన్న మార్చిలో యూఎస్‌టీఆర్ ప్రక్రియ మొదలైందంటేనే ట్రంప్ దురుద్దేశం అర్థమవుతుంది. ఈసారి సాకు చిత్రమైనది.
ఇప్పుడు సుంకాలు విధించబోయే దేశాలన్నీ మార్కెట్ డిమాండ్‌కు మించి సరుకుల్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యంలో ఉన్నాయట! అందుకని యూఎస్‌టీఆర్‌లోని సెక్షన్ 301 కింద దర్యాప్తు మొదలెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట. నివేదికను నిశితంగా పరిశీలిస్తే ఆరు ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా, చైనాపైనా అమెరికా శీతకన్నేసిందని తెలుస్తుంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఇటీవలి ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) శిఖరాగ్ర సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు.
అయినా ఆయనలో సామరస్య ధోరణి లేకపోగా, వాటివల్ల అమెరికా నష్టపోతున్నట్టు చిత్రిస్తున్నారు. అమెరికా వాలకం చూస్తే దానికి నిర్దిష్టమైన వ్యూహాత్మక విధానాలున్నట్టు అనిపించదు. మిత్ర దేశాలు, వాణిజ్య భాగస్వామ్య దేశాలు, దీటుగా పోటీ ఇచ్చే దేశాలు అనే విచక్షణ కనబడదు. నివేదిక చెబుతున్నట్టు నిజంగా ఇవి వచ్చే ఏడాదినుంచి అమల్లోకొస్తే, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ముందునాటి సుంకాల్ని దాదాపు చెల్లించక తప్పని స్థితి ఏర్పడుతుంది. యూఎస్‌టీఆర్ రెండు నెలలు దర్యాప్తుచేసి, మొన్న మేలో నివేదికఇచ్చింది.
కానీ దేశంలో మధ్యంతర ఎన్నికలు, మనీలా శిఖరాగ్రం, షెన్‌జెన్ త్రైపాక్షిక సమావేశం వగైరాలు ముగిశాక ఈ ప్రకటన చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టున్నారు. అమెరికా ఒత్తిళ్ల కారణంగా తప్పనిసరై వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండొ నేసియా, మలేసియా తదితర దేశాల్లో పాలకులపై జనం ఆగ్రహోదగ్రులవుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కుదువపెట్టారన్న విమర్శలొస్తున్నాయి. వారు దిక్కుతోచని స్థితిలోపడి తమ నిర్ణయంవల్లే అమెరికా సుంకాలు పది పన్నెండు శాతం మించలేదని సర్దిచెప్పుకుంటున్నారు. కానీ తాజా నిర్ణయం అమలైతే ఇవి ఒకేసారి 20 నుంచి 35 శాతానికి ఎగబాకుతాయి. మరి ఆ ఒప్పందాలవల్ల ఏం ప్రయోజనం ఉన్నట్టు?
తన వ్యూహం బెడిసికొడుతుందని ట్రంప్ గ్రహించలేకపోతున్నారు. ఆయననిర్ణయంవల్ల అవతలి దేశానికి కలిగే నష్టం మాటేమోగానీ... సరుకుల ధరలు మరింత పెరిగి అమెరికా వ్యాపారుల, వినియోగదారుల నడ్డి విరగడం ఖాయం. బెదిరింపులు, ఒత్తిళ్ల ద్వారా వేరే దేశాలను లొంగదీసి దేశ సంపద పెంచాలని ట్రంప్ అనుకుంటేఅది తెలివితక్కువతనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనేది పరస్పర సహకారం, ప్రతి దేశమూ ఎదిగేందుకు తగిన వాతావరణం కల్పించడంలోనే ఉంటుంది తప్పఇలాంటి బెదిరింపులవల్ల కాదు.
ఇంతకూ మన ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా, ప్రధాన రంగాలకు బ్యాంకుల రుణ సదుపాయం, చైనానుంచి ముడిసరకు దిగుమతి వగైరాలవల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని నివేదిక అంటున్నది. ఈ వరస చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ తన మోచేతి నీళ్లు తాగి పడివుండాలని అమెరికా భావిస్తున్నట్టు కనబడుతోంది. ట్రంప్ మరో రెండేళ్ల ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందాఅని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఆ తర్వాతైనా తీరు మారకపోతే అవితమ దారి తాము చూసుకుంటాయి. ఈలోగా అమెరికాకు జ్ఞానోదయమైతే దానికేమంచిది!


