లక్నో: సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్
గాయత్రి–ట్రెసా జంట 13–21, 21–10, 21–12తో మూడో సీడ్ పొలినా బుహ్రోవా–యెవెనియా కంటేమైర్ (ఉక్రెయిన్) ద్వయంపై గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత భారత షట్లర్లు గొప్పగా పోరాడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ఫైనల్ చేరారు.
నేడు జరగనున్న తుదిపోరులో నాలుగో సీడ్ ఇస్యానా స్యాహిరా మీదా–రింజాని క్విన్నారా నస్టిన్ (ఇండోనేసియా) జంటతో భారత జోడీ తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో తన్వీ 11–21, 21–10, 21–13తో భారత్‌కే చెందిన ఉన్నతీ హూడాపై గెలిచింది. ఫైనల్లో నాలుగో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్‌లాండ్)తో 17 ఏళ్ల తన్వీ తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కానాపురం సాత్విక్ రెడ్డి–రేషిక ఉదయసూరియన్ జంట సెమీఫైనల్లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.


