ఆల్పైన్ పైపర్స్ తరఫున బరిలోకి
బెంగళూరు: భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ గ్లోబల్ చెస్ లీగ్‌లో అరంగేట్రం చేయనుంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ నాలుగో సీజన్‌లో దివ్య డిఫెండింగ్ చాంపియన్ ఆలై్పన్ పైపర్స్ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఇటీవల అర్జున అవార్డు సొంతం చేసుకున్న 20 ఏళ్ల దివ్య... ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్, అనీశ్ గిరి, విదిత్‌లతో కలిసి పైపర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
‘తొలిసారి గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొననున్నా. చాలా ఉత్సాహంగా ఉంది. ఇది ఇతర చెస్ టోర్నమెంట్‌ల లాంటిది కాదు. దీనికి చాలా మంది ప్రేక్షకులు వస్తారు. వాళ్ల ముందు పావులు కదపడం కొత్త అనుభవం. దీని ఫార్మాట్ కూడా సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అందుకే ఇందులో పాల్గొనేందుకు ఉత్సుకతతో ఉన్నా. ఇక మన దేశంలో ఆడటం ఎప్పుడూ సంతోషమే’ అని దివ్య వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కార్ల్‌సన్ తమ జట్టులో ఉండటం గొప్ప విషయమని ఆమె చెప్పింది. విభిన్నంగా ఉండే ఈ లీగ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని దివ్య వెల్లడించింది. మిక్స్‌డ్ టీమ్ విధానంలో జరిగే ఈ సీజన్‌లో ఆరు ఫ్రాంచైజీల తరఫున 36 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు పాల్గొంటున్నారు. సెపె్టంబర్ 5న ప్రారంభం కానున్న సీజన్ సెపె్టంబర్ 13 వరకు కొనసాగనుంది.


