breaking news
Global Chess League
-
‘భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోండి’
బెంగళూరు: చదరంగపు రారాజు, ఆల్‌టైమ్ గ్రేట్ మాగ్నస్ కార్ల్సన్ కొన్నేళ్ల క్రితమే వరల్డ్ చాంపియన్‌షిప్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తనకు నచ్చిన రీతిలో, ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే పాల్గొంటున్నాడు. అయితే చెస్ టోర్నీ నిర్వాహకులు మాత్రం కార్ల్సన్ ఆడితే తమ టోర్నీ స్థాయి పెరుగుతుందనే ఆలోచనతో అతనికి అనుగుణంగా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. దీనిని స్వయంగా కార్ల్సన్ తప్పు పట్టాడు. తనను దృష్టిలో పెట్టుకొని అలా చేయవద్దని, చెస్ ఆట భవిష్యత్తు గురించి ఆలోచించాలని అతను సూచించాడు. ఫార్మాట్లు ఎన్ని మారినా, చివరకు ప్రజాదరణ ముఖ్యమని అతను గుర్తు చేశాడు. ‘ఫలానా టోర్నీలో ఆడాలనే ప్రేరణ నాకు కలిగినప్పుడు మాత్రమే ఇష్టంగా ముందుకు వస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అయితే చెస్ భవిష్యత్తు కోసం టోర్నీల నిర్వాహకులు మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇంకా ఎంతో కాలం ఆడను. చాలా తక్కువ సమయమే నాకు మిగిలింది. కాబట్టి నా ఇష్టాలను బట్టి మీ ప్రణాళికలు రూపొందించుకోవద్దు. ఇక్కడ ఆడాలని ఆసక్తి కలిగింది కాబట్టే వచ్చాను’ అని ఈ నార్వే స్టార్ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ కాలంగా వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న కార్ల్సన్ చెస్ చరిత్రలో అత్యధిక ఎలో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ‘ఇటీవల ప్రపంచ చెస్‌లో ఎన్నో సానుకూల అంశాలు కనిపించడం మంచి పరిణామం. గత ఐదారేళ్లుగా చెస్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు పెరిగారు. కాబట్టి కొత్త తరం కోసం కొత్త తరహాలో చెస్‌ను భిన్నమైన ఫార్మాట్లలో అందించాల్సి ఉంది. అయితే అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం కూడా లేదు’ అని అతను అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఆన్లైన్ చెస్ వల్ల ఈ ఆటకు ఆదరణ మరింత పెరిగిందని, దీనిని తగిన రీతిలో ప్రోత్సహిస్తే ప్రపంచ వ్యాప్తంగా చదరంగం స్థాయి పెరుగుతుందని అమెరికా గ్రాండ్‌మాస్టర్ లెవాన్ ఆరోనియన్ అన్నాడు. ఒలింపియాడ్ తర్వాతే... గుకేశ్‌తో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ పోరు కోసం ఒలింపియాడ్ ముగిసిన తర్వాతే సన్నాహాలు మొదలు పెడతానని చాలెంజర్ జవోఖిర్ సిందరోవ్ అన్నాడు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగే ఈ 14 క్లాసిక్ గేమ్‌ల పోరులో గుకేశ్‌కు సిందరోవ్ సవాల్ విసురుతున్నాడు. ‘ప్రస్తుతం రెండు టోర్నీలపైనే నా దృష్టి ఉంది. ఇప్పుడు గ్లోబల్ లీగ్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఒలింపియాడ్ నాకు చాలా ముఖ్యం. ఆ తర్వాతే గుకేశ్‌తో వరల్డ్ చాంపియన్ గురించి ఆలోచిస్తా’ అని ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సిందరోవ్ వెల్లడించాడు. బరిలో ఆరు జట్లు... గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో సీజన్ పోటీలు నేటి నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు కాంటినెంటల్ కింగ్స్, గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్, ఆలై్పన్ పైపర్స్, అమెరికన్ గ్యాంబిట్స్, అలస్కన్ నైట్స్, ముంబా మాస్టర్స్ బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఆరుగురు ప్లేయర్లు ఒకే సమయంలో ఆరు వేర్వేరు బోర్డులపై ఆడతారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. 20 నిమిషాల ర్యాపిడ్ టైమ్ కంట్రోల్ విధానంలో గేమ్‌లు జరుగుతాయి. తెల్ల పావులతో ఆడి గెలిస్తే 3 పాయింట్లు, నల్ల పావులతో గెలిస్తే 4 పాయింట్లు దక్కుతాయి. భారత ఆటగాళ్లలో విశ్వనాథన్ ఆనంద్, అర్జున్ ఇరిగేశి, అభిమన్యు మిశ్రా (నైట్స్), అరవింద్ చిదంబరం, ప్రణవ్ వెంకటేశ్ (కింగ్స్), కోనేరు హంపి, విదిత్ గుజరాతీ, దివ్య దేశ్‌ముఖ్ (పైపర్స్), నిహాల్ సరీన్ (గ్యాంబిట్స్), ద్రోణవల్లి హారిక (మాస్టర్స్) తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మాగ్నస్ కార్ల్సన్ పైపర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
గ్లోబల్ చెస్ లీగ్‌లో దివ్య దేశ్‌ముఖ్
బెంగళూరు: భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ గ్లోబల్ చెస్ లీగ్‌లో అరంగేట్రం చేయనుంది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ నాలుగో సీజన్లో దివ్య డిఫెండింగ్ చాంపియన్ ఆలై్పన్ పైపర్స్ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఇటీవల అర్జున అవార్డు సొంతం చేసుకున్న 20 ఏళ్ల దివ్య... ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్, అనీశ్ గిరి, విదిత్‌లతో కలిసి పైపర్స్కు ప్రాతినిధ్యం వహించనుంది. ‘తొలిసారి గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొననున్నా. చాలా ఉత్సాహంగా ఉంది. ఇది ఇతర చెస్ టోర్నమెంట్ల లాంటిది కాదు. దీనికి చాలా మంది ప్రేక్షకులు వస్తారు. వాళ్ల ముందు పావులు కదపడం కొత్త అనుభవం. దీని ఫార్మాట్ కూడా సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అందుకే ఇందులో పాల్గొనేందుకు ఉత్సుకతతో ఉన్నా. ఇక మన దేశంలో ఆడటం ఎప్పుడూ సంతోషమే’ అని దివ్య వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కార్ల్సన్ తమ జట్టులో ఉండటం గొప్ప విషయమని ఆమె చెప్పింది. విభిన్నంగా ఉండే ఈ లీగ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని దివ్య వెల్లడించింది. మిక్స్డ్ టీమ్ విధానంలో జరిగే ఈ సీజన్లో ఆరు ఫ్రాంచైజీల తరఫున 36 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు పాల్గొంటున్నారు. సెపె్టంబర్ 5న ప్రారంభం కానున్న సీజన్ సెపె్టంబర్ 13 వరకు కొనసాగనుంది. -
గ్లోబల్ చెస్ లీగ్ విజేత ఆల్పైన్ ఎస్జీ పైపర్స్
ముంబై: ‘హ్యాట్రిక్’ సాధించాలని ఆశించిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుకు చుక్కెదురైంది. టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్‌లో ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టు కొత్త చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ 2–0 (4–2; 4.5–1.5) పాయింట్ల తేడాతో తొలి రెండు ఎడిషన్స్‌లో టైటిల్ నెగ్గిన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టును బోల్తా కొట్టించింది. ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ జట్టులో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, లియోన్ ల్యూక్ మెండోంకా, కరువానా (అమెరికా), హు ఇఫాన్ (చైనా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), నినో బతియాష్విలి (జార్జియా) సభ్యులుగా ఉన్నారు. తొలి ర్యాపిడ్ మ్యాచ్‌లో ఆల్పైన్ జట్టు 4–2తో త్రివేణి జట్టును ఓడించింది. రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో అల్పైన్ జట్టు 4.5–1.5తో త్రివేణి జట్టును మళ్లీ ఓడించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది.కాంటినెంటల్ కింగ్స్ జట్టులో అలీరెజా (ఫ్రాన్స్), వె యి (చైనా), విదిత్ (భారత్), జు జినెర్ (చైనా), కొస్టెనిక్ (స్విట్జర్లాండ్), మౌరిజి (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. మూడో స్థానం మ్యాచ్‌లో పీబీజీ అలాస్కన్ నైట్స్ 3–1 (2–4; 3.5–2.5; 3.5–2.5; 4–2)తో గ్యాంజెస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టుపై నెగ్గింది. పీబీజీ అలాస్కన్ నైట్స్ జట్టులో గుకేశ్ దొమ్మరాజు, అర్జున్ ఇరిగేశి (భారత్), కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్), సారా ఖాదెమ్ (స్పెయిన్), లెనియర్ (అమెరికా), డేనియల్ దర్దా (బెల్జియం) సభ్యులుగా ఉన్నారు. -
గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: టెక్ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్ చెస్ లీగ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్‌లో నేటి నుంచి ఈ లీగ్ జరుగుతుంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా సీజన్–3 విన్నర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు. త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, ఆల్పైన్ ఎస్జీ పైపర్స్ మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ అధికారికంగా ఆదివారం ప్రారంభమవుతుంది. మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, అలీరెజా ఫిరూజా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లుఈ సీజన్ జీసీఎల్ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తుందని చైర్పర్సన్ పీయూష్ దూబే తెలిపారు. ఈ సీజన్లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు ఆడనున్నారు. ప్రధాన ఆటగాళ్లలో అలీరెజా ఫిరూజా, ఫాబియానో కరువానా, హికారు నకముర, హు ఇఫాన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు విశ్వనాథన్ ఆనంద్ సహా భారత మేటి ఆటగాళ్లు పోటీపడతారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ భారత చెస్ శక్తిని చాటుతున్నారు. రెండుసార్లు విజేతలైన త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. 10 రోజుల పాటుమరోవైపు.. పీబీజీ అలాస్కాన్ నైట్స్ జట్టు యజమాని పునిత్ బాలన్, గుకేశ్ అర్జున్ వంటి ప్రతిభావంతులతో తాము బలమైన స్థితిలో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జేసీఎల్ మూడో సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక ఈ లీగ్‌లో ప్రతి జట్టు 10 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 23న ఫైనల్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ఆరు బోర్డులపై పురుషులు, మహిళలు, యువ క్రీడాకారులు కలిసి పోటీపడతారు. భారత్‌లోని అభిమానులు జియో హాట్‌స్టార్ నెట్‌వర్క్‌లో లీగ్‌ను చూడవచ్చు. టిక్కెట్లు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.


