కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్‌ | Praggnanandhaa shocks Carlsen again in Norway Chess Tournament | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద షాక్‌

May 29 2026 4:45 AM | Updated on May 29 2026 4:45 AM

Praggnanandhaa shocks Carlsen again in Norway Chess Tournament

ప్రపంచ నంబర్‌వన్‌పై భారత గ్రాండ్‌మాస్టర్‌ గెలుపు  

ఓస్లో: నార్వే ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద సంచలన ప్రదర్శన చేశాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను బోల్తా కొట్టించాడు. మూడో రౌండ్‌లో  తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో కార్ల్‌సన్‌పై గెలు పొందాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకిది రెండో విజయం కావడం విశేషం. 

2024లో ఇదే టోర్నీలో తొలిసారి కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. మరోవైపు ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌కు మరో ఓటమి ఎదురైంది. ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌) 62 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. వీరిద్దరి మధ్య రెగ్యులర్‌ క్లాసికల్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను నిర్వహించారు. 

ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ మూడో విజయాన్ని అందుకుంది. బిబిసారా అసబయేవా (కజకిస్తాన్‌)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌ను దివ్య 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఆ తర్వాత ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో దివ్య 55 ఎత్తుల్లో బిబిసారాను ఓడించింది. అనా ముజీచుక్‌ (ఉక్రెయిన్‌)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌ను భారత నంబర్‌వన్‌ కోనేరు హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అయితే ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో ముజీచుక్‌ చేతిలో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement