నలుగురూ ఓడిపోయారు.. | Norway Open International Chess Tournament Divya Deshmukh Praggnanandha | Sakshi
Sakshi News home page

నలుగురూ ఓడిపోయారు..

Jun 2 2026 9:21 AM | Updated on Jun 2 2026 12:30 PM

Norway Open International Chess Tournament Divya Deshmukh Praggnanandha

భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్లు

దివ్య, హంపి, గుకేశ్, ప్రజ్ఞానందలకు నిరాశ

ఓస్లో: నార్వే ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆరో రౌండ్‌ భారత గ్రాండ్‌మాస్టర్లకు కలిసి రాలేదు. పురుషుల విభాగంలో పోటీపడుతున్న క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద... మహిళల విభాగంలో బరిలో ఉన్న ప్రపంచకప్‌ విజేత దివ్య దేశ్‌ముఖ్, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ కోనేరు హంపి పరాజయం చవిచూశారు.

క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌లో దివ్య 69 ఎత్తుల్లో ఓటమి పాలైంది. బిబిసారా అసబయేవా (కజకిస్తాన్‌)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌ను హంపి 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహించారు. అర్మగెడాన్‌ గేమ్‌లో బిబిసారా 24 ఎత్తుల్లో హంపిని ఓడించింది. ఆరో రౌండ్‌ తర్వాత దివ్య 8.5 పాయింట్లతో రెండో స్థానంలో... హంపి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

పురుషుల విభాగంలో విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్‌ 52 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ఓడిపోయాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)తో జరిగిన రెగ్యులర్‌ గేమ్‌లో నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 55 ఎత్తుల్లో గెలుపొందాడు.

ఈ టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ గేమ్‌లో గెలిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. రెగ్యులర్‌ గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్‌ గేమ్‌లో విజయం సాధిస్తే 1.5 పాయింట్లు దక్కుతాయి. ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆరో రౌండ్‌ తర్వాత గుకేశ్‌ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement