న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ‘పేటీఎమ్’ మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్’లో విదేశీ, దేశీయ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు భారీగా వాటాలను కొనుగోలు చేశాయి. గోల్డ్‌మెన్ శాక్స్, బీఎన్‌పీ పారిబాస్, సొసైటీ జెనరల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు భారతీయ మ్యూచువల్ ఫండ్ దిగ్గజాలు ఓపెన్ మార్కెట్ ‘బ్లాక్ డీల్’ ద్వారా సుమారు రూ.2,949 కోట్ల విలువైన 3 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బ్లాక్ డీల్ సమాచారం ప్రకారం.. ఈ సంస్థలు సగటున ఒక్కో షేరుకు రూ.1,535.10 చొప్పున మొత్తం 1,92,10,110 ఈక్విటీ షేర్లను (3% వాటాకు సమానం) కొనుగోలు చేశాయి. పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన ‘రెసిలెంట్ అసెట్ మేనేజ్‌మెంట్’ ఈ 3% వాటాను విక్రయించింది.
వాటా కొనుగోలు చేసిన ప్రధాన సంస్థలు:
కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థలో గోల్డ్‌మెన్ శాక్స్, బీఎన్‌పీ పారిబాస్, సొసైటీ జెనరల్, ఘిసాల్లో క్యాపిటల్, ఆక్స్‌బో క్యాపిటల్, నార్త్ రాక్ క్యాపిటల్, విరిడియన్ అసెట్ మేనేజ్‌మెంట్, విక్టోరియా ఫండ్–ఓసీ, ఇంటెగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ (ఆసియా) ఉన్నాయి. అలాగే ఎస్‌బీఐ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, హెచ్‌ఎస్‌బీసీ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, టాటా ఎంఎఫ్ తదితర దేశీయ మ్యూచువల్ ఫండ్లున్నాయి. వీటితో పాటు బీమా రంగానికి చెందిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలున్నాయి.


