న్యూఢిల్లీ: గతేడాది సెప్టెంబర్‌లో హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నంబరు విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి 77 లక్షల పైచిలుకు వెండి ఆభరణాలు, ఇతరత్రా ఉత్పత్తులను హాల్‌మార్కింగ్ చేసినట్లు నాణ్యతా ప్రమాణాల ప్రాధికార సంస్థ బీఐఎస్ తెలిపింది. పరిమాణం ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. ‘2025 సెప్టెంబర్ 1న సిల్వర్ హెచ్‌యూఐడీ పోర్టల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 77 లక్షలకు పైగా వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్ నమోదైంది‘ అని వివరించింది.
హాల్‌మార్క్ చేసిన ఉత్పత్తుల్లో స్వచ్ఛతకు సంబంధించి 925, 800 గ్రేడ్‌ల వాటా దాదాపు 95 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు 25,000కు పైగా వెండి జ్యుయలర్లు హాల్‌మార్కింగ్ కోసం బీఐఎస్‌లో నమోదు చేసుకున్నారు. 102 జిల్లాల్లో 341 సిల్వర్ అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలు (ఏహెచ్‌సీ) ఉన్నాయి.
హాల్‌మార్క్ చేసిన ప్రతి వెండి ఉత్పత్తిపైనా బీఐఎస్ స్టాండర్డ్ గుర్తు, స్వచ్ఛత గ్రేడ్, ఆరంకెల అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు) హెచ్‌యూఐడీ నంబరును లేజర్‌తో ముద్రిస్తారు. దీనితో వెండి స్వచ్ఛతకు సంబంధించి స్పష్టమైన హామీ లభించినట్లవుతుంది. జ్యుయలర్లు స్వచ్ఛందంగా పాటించేలా 2005 అక్టోబర్‌లోనే దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ, గతేడాది సెపె్టంబర్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు. ఈ స్కీము కింద స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్ ఆభరణాలను అమ్మేందుకు విక్రేతలకి రిజి్రస్టేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది.
దక్షిణాదిలో 62 శాతం..
బీఐఎస్ నిర్వహించిన మార్కెట్ సర్వే ప్రకారం 62 శాతం హాల్‌మార్కింగ్‌తో దక్షిణాది ప్రాంతం అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమ, సెంట్రల్ రీజియన్లు వరుసగా 18 శాతం, 10 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 345 జిల్లాల్లో 4,971 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దీని ప్రకారం 10-25 గ్రాములు, 25-50 గ్రాముల వెండి ఆభరణాలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ నెలకొంది.


