రూ. 7,600 కోట్ల ఐపీవోకు అవాడా ఎలక్ట్రో రెడీ | Avaada Electro IPO Updated Prospectus Rs 7600 Crore fundraise | Sakshi
Sakshi News home page

రూ. 7,600 కోట్ల ఐపీవోకు అవాడా ఎలక్ట్రో రెడీ

Aug 27 2026 9:21 PM | Updated on Aug 27 2026 9:21 PM

Avaada Electro IPO Updated Prospectus Rs 7600 Crore fundraise

న్యూఢిల్లీ: సోలార్‌ తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను సిద్ధం చేసింది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వీటిని దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 7,600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 1,600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.

మరో రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ అవాడా వెంచర్‌ విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌కు పెట్టుబడులున్న అవాడా గ్రూప్‌ ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,200 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ తొలుత 2025 అక్టోబర్‌లో గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. 2026 ఏప్రిల్‌లో అనుమతి పొందింది.  

కంపెనీ వివరాలివీ 
2021లో ఏర్పాటైన అవాడా ఎలక్ట్రో ప్రధానంగా సోలార్‌ సెల్స్, మాడ్యూల్స్‌ తయారీని చేపడుతోంది. వీటిని ఎన్‌ల్యూమ్, ఇంటెగ్లో బ్రాండ్లతో వీటిని మార్కెటింగ్‌ చేస్తోంది. 2026 జూలై31కల్లా కంపెనీ 8.5 గిగావాట్ల సోలార్‌ మాడ్యూల్‌ నిర్వహణా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా మరో 3 గిగావాట్ల నిర్వహణా టాప్‌కాన్‌ సోలార్‌ సెల్‌ తయారీని సైతం చేపడుతోంది. 2027–28కల్లా సోలార్‌ మాడ్యూల్‌ సామర్థ్యాన్ని 13.6 గిగావాట్లకు, సోలార్‌ సెల్‌ సామరŠాధ్యన్ని 12 గిగావాట్లకు పెంచుకునే యోచనలో ఉంది.

ఈ బాటలో 3 గిగావాట్ల ఇన్‌గాట్, వేఫర్‌ సామర్థ్యాలను అందుకోవాలని భావిస్తోంది. తద్వారా సమీకృత తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్‌)కు తెరతీసే లక్ష్యంతో ఉంది. వీటితోపాటు అవాడా హాలో బ్రాండుతో ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లు అందించే ప్రణాళికల్లో ఉంది. ఈపీసీ, ఓఅండ్‌ఎం కార్యకలాపాలలోకి సైతం ప్రవేశించాలని చూస్తోంది.

యూపీలోని దాద్రిలో, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) ఆదాయం రూ. 5,304 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 889 కోట్లను తాకింది. ఏడాది కాలంలోనే కంపెనీ మాడ్యూల్‌ సామర్థ్యం 1.5 గిగావాట్ల నుంచి 8.5 గిగావాట్లకు జంప్‌చేయగా.. ఆర్డర్‌బుక్‌ 7 రెట్లు ఎగసి 2,555 మెగావాట్ల నుంచి 19,106 మెగావాట్లకు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement