న్యూఢిల్లీ: దేశీయంగా సోలార్ సెల్స్ లభ్యతలో ఎదురవుతున్న కొరత కేవలం తాత్కాలిక సవాలేనని, స్థానిక తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుండటంతో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 32 గిగావాట్లుగా ఉండగా, డిసెంబర్ 2027 నాటికి ఇది ఏకంగా 100 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అలాగే సోలార్ ప్యానెళ్ల (మాడ్యూల్స్) తయారీ సామర్థ్యం ఇప్పటికే 200 జీడబ్ల్యూ దాటిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సౌర సెల్‌లను కలిపి మాడ్యూళ్లు లేదా సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్’ ఫర్ సోలార్ సెల్స్ (ఏఎల్‌ఎంఎ లిస్ట్– ఐఐ) నేపథ్యంలో దేశీయంగా తయారైన సెల్స్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రూఫ్‌టాప్, ఇతర స్థానిక కంటెంట్ నిబంధనల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ నిపుణులు స్పందించారు.
స్థానిక తయారీతోనే ఆత్మనిర్భరత
‘‘మొత్తం మాడ్యూల్ సామర్థ్యంతో దేశీయ సెల్స్ సామర్థ్యాన్ని పోల్చి చూడటం సరైనది కాదు. ఎందుకంటే అన్ని మాడ్యూల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయవు. ఇది సాంకేతికత, స్పెసిఫికేషన్లు సరిపోలడానికి పడుతున్న స్వల్పకాలిక సమయం మాత్రమే. విదేశాలపై ఆధారపడటం తగ్గించి, కీలక విడిభాగాలను ఇక్కడే తయారు చేసుకున్నప్పుడే నిజమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధ్యమవుతుంది’’ అని అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్ తెలిపారు. అవాడా తన సౌర సెల్‌ల తయారీ సామర్థ్యాన్ని 6 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, దేశీయ మాడ్యూల్ తయారీదారులకు హాఫ్‌కట్ సెల్‌లను సరఫరా చేయనున్నట్లు చెప్పారు.
ధీర్ఘకాలిక ఇంధన భద్రత
ఏఎల్‌ఎంఎ లిస్ట్– ఐఐ నిబంధన దేశీయ సౌర రంగాన్ని మాడ్యూళ్ల అసెంబ్లింగ్ నుంచి పూర్తిస్థాయి స్వదేశీ తయారీ వైపు నడిపిస్తోందని విక్రమ్ సోలార్ ఎండీ జ్ఞానేష్ చౌదరి తెలిపారు. విక్రమ్ సోలార్ కంపెనీ 2026–27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 9 గిగావాట్ల దేశీయ సౌర సెల్ తయారీ సామర్థ్యాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. విధానపరమైన నిర్ణయాలు స్పష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఎస్పీడీఏ ప్రతినిధి రవివర్మ అభిప్రాయపడ్డారు.
కాగా, క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా 2025 నవంబర్‌లో చేసిన అంచనా ప్రకారం.. ఏఎల్‌ఎంఎం లిస్ట్– ఐఐ తర్వాత పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దేశీయ సౌర సెల్‌ల తయారీ సామర్థ్యం డిసెంబర్ 2027 నాటికి సుమారు 100 గిగావాట్లకు చేరవచ్చు. మాడ్యూల్ తయారీ సామర్థ్యం మార్చి 2027 నాటికి 165 గిగావాట్లను అధిగమించే అవకాశం ఉందని తెలిపింది. అయితే చిన్న తరహా మాడ్యూల్ తయారీదారులు విలీనాల వైపు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


