విస్తృతమవుతున్న ఏఐ భయాలతో ప్రపంచమంతా కలవరపడుతోంది. ఓ వైపు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఏఐతో ఏమౌతుంతోనని ఇప్పటికే వణికిపోతుంటే.. ముందుంది అసలు ముప్పు అంటూ ప్రముఖ ఆర్థికవేత్త చేసిన హెచ్చరిక అమెరికాను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత డారన్ అసెమోగ్లు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రస్తుత విధానాల్లో మార్పులు లేకపోతే, వచ్చే పదేళ్లలో అమెరికాలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఇటీవల సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసెమోగ్లు ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెమోగ్లు అభిప్రాయం ప్రకారం.. గత పారిశ్రామిక విప్లవాలతో పోలిస్తే ఏఐ పరిణామం అసాధారణ వేగంతో సాగుతోంది. పారిశ్రామిక విప్లవం తొలి దశ విస్తరించడానికి దశాబ్దాలు పట్టగా, ఇప్పుడు ఏఐ ఆధారిత మార్పులు కేవలం ఒకటి, రెండేళ్ల వ్యవధిలోనే అనేక రంగాలను ఒకేసారి ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మానవులు చేసే పనులను నేరుగా ఆటోమేట్ చేసే దిశలో ఏఐ అభివృద్ధి సాగితే ఉద్యోగాలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
‘కొత్త ఉద్యోగాలు వస్తాయి’ నిజమే కానీ..
ఏఐ అభివృద్ధితో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయని అసెమోగ్లు అంగీకరించారు. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, వాటి పనితీరును మెరుగుపరచడం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే ఏఐ వల్ల కోల్పోయే ఉద్యోగాలతో పోలిస్తే ఈ కొత్త నియామకాలు చాలా తక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఏఐని మానవుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా అభివృద్ధి చేయాలని, వారిని పూర్తిగా భర్తీ చేసే సాంకేతికతగా కాకుండా చూడాలని సూచించారు.
అమెరికన్లలోనూ పెరుగుతున్న ఆందోళన
ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయన్న భయం కేవలం ఆర్థికవేత్తలకే పరిమితం కాలేదు. 2026 జూన్‌లో నిర్వహించిన సర్వేలో 71 శాతం మంది అమెరికన్లు వచ్చే 20 ఏళ్లలో ఏఐ వల్ల అమెరికాలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2024లో ఇదే అభిప్రాయం 64 శాతం మందిలో ఉండగా, రెండేళ్లలో ఆ వాటా 7 శాతం పెరిగింది. కేవలం 5 శాతం మంది మాత్రమే ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని భావించారు.
ఈ నేపథ్యంలో ఏఐపై విధానపరమైన స్పందన అవసరమని అసెమోగ్లు సూచిస్తున్నారు. సాంకేతికతను అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూనే, మానవులను మరింత ఉత్పాదకంగా మార్చే ఏఐ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన అంటున్నారు. అదే సమయంలో నిజమైన ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేలా పన్ను విధానాలను మార్చడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని సూచించారు.
డారన్ అసెమోగ్లు 2024లో సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్సన్‌లతో కలిసి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సమాజంలోని సంస్థలు ఎలా ఏర్పడతాయి, అవి దేశాల సుసంపన్నతను ఎలా ప్రభావితం చేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం లభించింది.
ఇదీ చదవండి: చైనాలో భారీగా మూతపడిన బ్యాంకులు


