నీటిపారుదల, విద్యుత్ శాఖల సమన్వయ కృషి
సభలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సౌర విద్యుత్, జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో గురువారం ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని వివరించారు. త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కుమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, పోచారం వంటి జలాశయాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సాధారణ సోలార్ ప్రాజెక్టులతో పోలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు వ్యయం ఎక్కువ అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద మెగావాట్‌కు రూ.కోటి వరకు సహాయం అందించే పథకాన్ని ప్రకటించినా, అందులో కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని భట్టి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు 15 వేల మెగావాట్లు గరిష్ట డిమాండ్ ఉంటే, ఈ నెల 9వ తేదీన అది 19 వేల మెగావాట్లకు చేరిందన్నారు.
సోలార్ గ్రిడ్ ఏర్పాటు
అమ్రాబాద్‌లో సోలార్ పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి వెల్లడించారు. 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి, అక్కడ మైక్రో గ్రిడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గతంలో పంపిణీ చేసిన సుమారు 6.70 లక్షల ఎకరాలను కూడా సౌర విద్యుత్ ప్రోత్సాహానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పేరుతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


