సాక్షి, హైదరాబాద్: సీఎల్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఘటనలపై ఫ్లాష్ సర్వే చేయించానని.. బీఆర్‌ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయిందన్నారు. ప్రజలు.. బీఆర్‌ఎస్ నేతల తీరునే తప్పుపట్టినట్లు సర్వేలో తేలిందన్న రేవంత్.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి అండగా నిలబడ్డారు. మొన్నటి ఘటనలో పోలీసులు చాలా ఓర్పుతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
‘‘కోటి ఎకరాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కానీ 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22ఏలో ఉంది. మిగతాది అంతా ప్రభుత్వ, అటవీ భూములే. నేను ‘సర్’ కోసం రెండు రోజులు కొడంగల్‌లో ఉన్నాను. అందరూ అదే విధంగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.
శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టాం. సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు.


