సాక్షి, హైదరాబాద్: మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయవద్దు అంటూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్‌లోని ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని కలుషితం చేయకుండా కాపాడాలని, నదిని కాపాడుకుందాం - ప్రజా హక్కులను రక్షించుకుందాం అంటూ వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమ కారులు ఈ పోరాటాన్ని చేపట్టారు.
పర్యావరణవేత్తలు డా బాబూరావు, డా. దొంతి నరసింహా రెడ్డి గార్లు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడబోయే పర్యావరణ అంశాలను వివరించారు. మూసి కాలుష్యానికి కారణం బస్తీలు కాదు పరిశ్రమలని తెగేసి చెప్పారు. మూసి పై కొత్త నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట వేలాది కుటుంబాలను బలవంతంగా నిర్వాసితులను చేసే ప్రమాదకరమైన ప్రణాళికలని మండిపడ్డారు.

తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదనీ, కానీ సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను, పర్యావరణ పునరుద్ధరణను కాపాడుతూ సరైన నది పరీవాహక ప్రాంత ప్రణాళితో, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగల్ చేయవద్దని ఈ సందర్బంగా పలువురు వక్తలు కోరారు.మూసీ నది కలుషితం కాకుండా చేయడంతోపాటు, ప్రాజెక్ట్ డిపిఆర్‌లో బాధితులను సంప్రదించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు, సామాజిక కార్యకర్తలు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


