నినాదాల హోరు.. పాటల జోరు | BRS members walked out of the Telangana Legislative Council | Sakshi
Sakshi News home page

నినాదాల హోరు.. పాటల జోరు

Sep 11 2026 1:18 AM | Updated on Sep 11 2026 1:18 AM

BRS members walked out of the Telangana Legislative Council

శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన 

‘22ఏ’పై వాయిదా తీర్మానం ఇచ్చిన విపక్ష ఎమ్మెల్సీలు 

ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పట్టు... వాయిదా తీర్మానం తిరస్కరించినట్లు చైర్మన్‌ ప్రకటన  

నిరసనగా వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు...నిరసన పాటలతో గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. నిషేధిత భూముల (22ఏ) అంశంపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన విపక్ష సభ్యులు దానిపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పోడియం వైపు దూసుకొచ్చి నినాదాలు, నిరసన పాటలతో హోరెత్తించారు. తీర్మానం తిరస్కరిస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. 

అయితే 22ఏ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానం చర్చకు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్‌.రమణ, దాసోజు శ్రవణ్, శంభీపూర్‌ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, వాణీదేవి, నవీన్‌రావు తదితరులు వెల్‌వైపు దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు పట్టుబట్టారు. ప్లకార్డులు తీసేయాలని చైర్మన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గలేదు. 

నినాదాల హోరు 
‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడదాం..ముఖ్యమంత్రి భూ దోపిడీ నశించాలి..సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించిన భూములను రద్దు చేయాలి..22ఏ నిషేధిత భూముల అంశంపై వెంటనే చర్చ చేపట్టాలి..’అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదా లు చేశారు. వారు చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. 

ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే సభ మర్యాద పాటిస్తూ నిబంధనలు పాటించాలని సూచించారు. మరోవైపు ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్దే నిలబడి తమ నిరసన కొనసాగించారు. దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న కాంగ్రెస్‌ పార్టీ విధానాలు, సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నిరసన పాట లు పాడారు. దీనికి మిగిలిన ఎమ్మెల్సీలు చ ప్పట్లతో కోరస్‌ ఇచ్చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. చైర్మన్‌ వారించినా బీఆర్‌ఎస్‌ సభ్యులు వెనక్కి తగ్గలేదు. అయినా ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.  

నినాదాల కాగితం ప్రదర్శించిన శంభీపూర్‌ రాజు 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు.. తీన్మార్‌ మల్లన్న పక్క సీటులోకూర్చుని అకస్మాత్తుగా తన జేబులోంచి ‘బామ్మర్దికి అమృత్‌ టెండర్లు, తమ్ముడికి రావిరాల భూములు.. రైజింగ్‌ ఎనుముల ఫ్యామిలీ’అని నినాదాలు రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శించారు. దీనిపై చైర్మన్‌ గుత్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

బీఆర్‌ఎస్‌ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై చర్చించే అవకాశం ఇస్తానని ప్రకటించారు. కాసేపటి తర్వాత ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో..22ఏ అంశంపై బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement