తెలంగాణ: రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వర్షాల ప్రభావం ఉండొచ్చని, ముఖ్యంగా 12, 13 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెబుతోంది. దీంతో గతంలో అంచనా వేసిన దానికంటే వర్షాలు ముందుగానే మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలహీనపడి విదర్భ ప్రాంతంలో బలహీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసి 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈ రెండు రోజులు మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12న వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య వర్షాలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులను బట్టి తాజా అంచనాల్లో మార్పులు ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.


