సాక్షి, సూర్యాపేట జిల్లా: ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోదాడ సీసీ రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. కోదాడ మెగా జాబ్‌మేళా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ, సింగరేణి, పరిశ్రమల శాఖ అధికారుల హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క ఉద్యోగం యువత జీవితాన్నే కాదు. కుటుంబ భవిష్యత్తునూ మారుస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు యువత ముందుకు రావాలి. యువత ప్రతిభకు, నైపుణ్యానికి తగిన అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
ప్రతి నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా సమాచారం చేరేలా ప్రచారం చేపట్టాలి. హుజూర్‌నగర్ మెగా జాబ్‌మేళా స్ఫూర్తితో కోదాడలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. హుజూర్‌నగర్ జాబ్‌మేళాకు దాదాపు 40 వేల మంది నమోదు చేసుకున్నారు. 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కోదాడ జాబ్‌మేళా యువత కలలకు కొలువు దారి కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి జాబ్‌మేళాకు పంపాలి’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.


