చండీగఢ్: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లను పెట్టుబడి విషయాలలో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తూ తాజాగా ప్రాజెక్ట్ జాగరూక్‌కు తెరతీసింది. తద్వారా ఫైనాన్షియల్ సలహాలతో ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఫిన్‌ఫ్లుయర్స్‌తోపాటు.. చట్టవిరుద్ధంగా అందించే టిప్స్, పెట్టుబడులపై భారీ రిటర్నుల హామీలు తదితర అంశాలపట్ల అవగాహనను పెంచేందుకు నడుం బిగించినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
సెక్యూరిటీలలో మార్కెట్లలో పారి్టసిపేషన్‌కు, అవగాహనకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఇన్వెస్టర్ల సర్వేలో గుర్తించినట్లు ప్రస్తావించారు. వెరసి ఇన్వెస్టర్లకు మార్కెట్లపట్ల అవగాహన పెంచవలసిన అవసరమున్నట్లు పేర్కొన్నారు. ఎవరో సలహా ఇచ్చారనో లేదా అందరూ లావాదేవీలు చేస్తున్నారనో పెట్టుబడులు పెట్టొద్దని ఇన్వెస్టర్లకు ఈ సందర్భంగా పాండే సూచించారు.


