వధువు కావలెను! | Shortage of Brides in Telugu States | Sakshi
Sakshi News home page

వధువు కావలెను!

Aug 21 2026 5:02 AM | Updated on Aug 21 2026 5:02 AM

Shortage of Brides in Telugu States

తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం మంది యువత ఒంటరిగానే! 

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికూతుళ్ల కొరత 

అబ్బాయిలకు ఆస్తిపాస్తులున్నాతప్పని వెతుకులాట 

డిజిటల్‌ వేదికలపై వేలాది రిజిస్ట్రేషన్లు 

అమ్మాయిల అన్వేషణలో తల్లిదండ్రులు

ఆకుపచ్చని తోరణాలు.. మంగళవాయిద్యాల సడి.. ముహూర్తాల శ్రావణ మాసం వచ్చేసింది. ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ, ఎంతోమంది పెళ్లికొడుకుల ఇళ్లలో మాత్రం ఒకటే టెన్షన్‌.. అదే ‘వధువు కావలెను!’.

బద్వేలు/కాశినాయన: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా పెళ్లికూతుళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కులంలో చూసినా ‘అమ్మాయి దొరకడం లేదు’ అనే మాటే బలంగా వినిపిస్తోంది. చేతిలో మంచి ఉద్యోగం, ఎకరాల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు వధువు దొరకడం గగనమైపోతోంది.  శ్రావణ మాసం ముహూర్తాల సీజన్‌ ప్రారంభమై కళ్యాణ మండపాలన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నా.. వధువు దొరకని వేలాది మంది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ మాత్రం ఈ సీజన్‌లోనైనా తమ మురిపెం తీరుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

సామాజిక మాధ్యమాలే వేదికగా.. 
సాంప్రదాయ మార్గాల్లో సంబంధాలు దొరక్కపోవడంతో చాలామంది అబ్బాయిలు ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ గ్రూపుల వంటి సామాజిక మాధ్యమాలను కూడా వేదికగా చేసుకుని ప్రకటనలు ఇస్తున్నారు. తమ ఫోటోలు, ఉద్యోగం, జీతం వివరాలతో పోస్టులు పెడుతూ ‘వధువు కావలెను’ అంటూ బహిరంగంగానే అన్వేషణ సాగిస్తున్నారు.  

ఎదురు కటా్ననికి సిద్ధం.. ఏ కులమైనా ఓకే! 
వరకట్న వేధింపులు, ఆంక్షలే ఒకప్పుడు సమాజంలో ఆడపిల్లల జనాభా తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఒకప్పుడు వరకటా్నల కోసం డిమాండ్‌ చేసిన అబ్బాయిల తల్లిదండ్రులు, ఇప్పుడు రూట్‌ మార్చి ‘అమ్మాయి దొరికితే చాలు’ అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కులాల్లో ఆడ పిల్లల కొరత మరీ తీవ్రంగా ఉండటంతో చాలా మంది పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. ఈ క్రమంలో ‘అమ్మాయి నచ్చితే చాలు.. ఏ కులమైనా సరే చేసుకుంటాం’ అంటూ చాలా కుటుంబాలు తమ కుల నిబంధనలను సైతం పూర్తిగా సడలిస్తుండటం గమనార్హం.  

వెబ్‌సైట్లలో వేలాది రిజిస్ట్రేషన్లు! 
ఈ పెళ్లికూతుళ్లకు కొరత మ్యారేజ్‌ బ్యూరోలకు మాత్రం చేతినిండా పని కలి్పస్తోంది. సంప్రదాయ మార్గాలతో పాటు ఇప్పుడు డిజిటల్‌ వేదికలు సైతం తోడయ్యాయి. వివాహ సంబంధాల కోసం మ్యారేజ్‌ బ్యూరోలు ప్రత్యేకంగా వెబ్‌సైట్లను ప్రారంభించాయి. దీంతో అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు కావాలో.. వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాల వివరాలను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ వివాహ పరిచయ వేదికలకు గిరాకీ విపరీతంగా పెరిగింది.  

సాఫ్ట్‌వేర్‌ బాబులకూ తప్పని తిప్పలు.. 
ప్రస్తుతం పట్టణాల్లో ఉండి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లేదా ఐటీ రంగంలో నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న అబ్బాయిలకు కూడా వధువు దొరకడం గగనంగా మారింది. నేటి తరం చదువుకున్న అమ్మాయిలు  జీతం మాత్రమే కాకుండా.. అబ్బాయి ప్రవర్తన, అల వాట్లు, కుటుంబ నేపథ్యం, పట్టణంలో సొంత ఇల్లు ఉందా? లేదా? వంటి కఠిన నిబంధనలు విధిస్తుండటంతో వేలాది ప్రొఫైల్స్‌ హోల్డ్‌లో ఉండిపోతున్నాయి.  

వ్యవసాయం చేసేవారికి చుక్కలు! 
ఈ డిజిటల్‌ యుగంలో పల్లెటూళ్లలో ఉంటూ ఎకరా భూమి ఖరీదు కోట్లల్లో ఉన్నప్పటికీ.. కేవలం ‘వ్యవసాయం’ చేస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో అబ్బాయి లను తీవ్రంగా తిరస్కరిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ‘పెళ్లికాని ప్రసాదుల’ సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది.  

సరిహద్దుల వైపు చూపు! 
కొన్ని జిల్లాలలో స్థానికంగా అమ్మాయిలు దొరక్కపోవడంతో.. అబ్బాయిల తల్లిదండ్రులు పొరుగు రాష్ట్రాల సరిహద్దు పల్లెటూళ్ల వైపు చూస్తున్నారు. భాషా సమస్యలు ఉన్నప్పటికీ, పెళ్లి కావడం ముఖ్యమనే ఉద్దేశంతో  సరిహద్దు రాష్ట్రాల గ్రామాల్లోని అమ్మాయిలతో సంబంధాలు ఖాయం చేసుకుంటున్నారు.  

కడుపులోనే చిదిమేస్తున్న వైనం.. లింగ నిష్పత్తి శాపం!
పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడ పిల్లలను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే చట్టవిరుద్ధంగా కడుపులో పెరుగుతున్నది.  ఆడ, మగ అని తెలుసుకుని.. ఆడ పిల్ల అయితే కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇలా గత రెండు, మూడు దశాబ్దాలుగా భ్రూణహత్యల వల్ల లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోవడం ఇప్పుడు పెద్ద శాపంగా మారింది. ఆడపిల్లల జనాభా ఘోరంగా తగ్గిపోవడంతో, నేడు పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిలకు, వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు. ఈ జనాభా అసమతుల్యత కారణంగానే తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం మంది యువత పెళ్లి కాకుండా ఒంటరిగానే మిగిలిపోతున్నారని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

మ్యారేజ్‌ బ్యూరోల రికార్డులు:   90% అబ్బాయిలే!
వివిధ వివాహ వేదికల డేటా ప్రకారం.. రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న వారిలో 90 శాతానికి పైగా అబ్బాయిల ప్రొఫైల్స్‌ ఉంటుండగా, అమ్మాయిల వివరాలు మాత్రం పది శాతం కూడా దాటడం లేదు. గతంలో అమ్మాయిల తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిల తండ్రులు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు. ‘మాకు ఆస్తిపాస్తులతో పనిలేదు, అమ్మాయి నచ్చితే చాలు.. ఏదైనా కొత్త ప్రొఫైల్‌ వస్తే మొదట మాకే చెప్పండి, ఫీజు ఎంతైనా ఇస్తాం’ అంటూ అబ్బాయిల తల్లిదండ్రులు బ్యూరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో...
ఉద్యోగాల పేరుతో రాష్ట్రా­లు దాటి పోతున్నారు. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డ యువత మ్యారేజీ గురించి ఆలోచించడం లేదు. పైగా ఆడపిల్లల కొరత ఉండనే ఉంది. గతంలో నేను ఏటా 100కు పైగా  పెళ్లిళ్లు చేసేవాడిని. ఇప్పుడు ఆ సంఖ్య చాలావరకు తగ్గింది. 
– కె.హెచ్‌. విజయభట్టర్, ఉమ్మడి కడప జిల్లా పురోహిత అధ్యక్షుడు. 

మగ పిల్లలకు పెళ్లి చేయాలంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యారేజీ పనుల మీద తిరుగుతుంటాను. మగ పిల్లలకు సంబంధం కుదు­ర్చాలంటే చాలా కష్టమవు తోంది. అమ్మాయిల కొర­త ఉంది. ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు అనేక ఆంక్షలు పెడుతున్నారు. జీతభత్యాలు.. ఆస్తి పా స్తులు చూస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్లయితే గ్రామా­ల్లో వందల మంది 30,40 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాక నిలబడి పోయారు.  – చిన్నపురెడ్డి, మ్యారేజీ బ్యూరో, రెడ్డిపల్లె,కలసపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement