బయట సమస్యలతో పాటు తయారీ, ఇంధనం, వ్యవసాయం, టెక్నాలజీ తదితర అంశాలన్నింటా వ్యవస్థాగత అవరోధాలతో ప్రస్తుత సంవత్సరం (2026).. 1991ని తలపిస్తోందని, దాదాపు అప్పుడు నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. అలాగని దీన్ని ఆనాటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితిగా భావించరాదని, ఎకానమీకి ఇదొక కీలక దశ అనేదే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వెంటాడిన సవాళ్లనీ కలిపి ఒక్కసారిగా బైటపడటంతో, వాటిని అధిగమించేందుకు 1991లో సంస్కరణలపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాగేశ్వరన్ చెప్పారు. ప్రస్తుతం 2026లో వివిధ అంశాలవారీగా భారత వృద్ధి బాటలో అవరోధాలు ఎదురవుతున్న నేపథ్యంలో ముందుకు సాగేందుకు వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఐఎస్‌ఐడీ-ఐడీఆర్‌ఏ జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ ముందు 40 ఏళ్లతో పోలిస్తే రాబోయే 20-30 సంవత్సరాలు వేరుగా ఉంటాయని నాగేశ్వరన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరాపరమైన కొరత వల్ల ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 ఏళ్లలో సముచిత ద్రవ్య పరపతి విధానాన్ని అమలు చేయడం కష్టతరంగా ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి: బంగారం డిమాండ్.. WGC రిపోర్ట్


