వన్యప్రాణులను కాపాడటం ఒక్క దేశం లేదా.. ఒక సంస్థ బాధ్యత మాత్రమే కాదు. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, శాస్త్రవేత్తలు, జంతు వైద్యులు కలిసి పనిచేస్తేనే అరుదైన జంతువులను సంరక్షించడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా వేదికగా 'యూరేషియన్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్' (EARAZA) అంతర్జాతీయ వార్షిక సదస్సు 2026 నిర్వహించారు.
30 దేశాలు.. 98 సంస్థల ప్రతినిధులు
అక్టోబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాలకు చెందిన 98 సంస్థల ప్రతినిధులతో పాటు భారత్‌లోని 29 జంతు ప్రదర్శనశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. 'వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం' అనే ప్రధాన అంశంతో ఈ సదస్సు కొనసాగుతోంది.
ఈ కార్యక్రమాన్ని మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త రికీ కేజ్ సంగీత ప్రదర్శనతో ప్రారంభించారు. అనంతరం EARAZA అధ్యక్షురాలు స్వెత్లానా అకులోవా, ప్రొఫెసర్ రామన్ సుకుమార్, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వి. క్లెమెంట్ బెన్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఏడాది పాటు ANTZ సాఫ్ట్‌వేర్ ఫ్రీ
ఈ సందర్భంగా వంతారా సీఈఓ వివాన్ కరానీ ఒక కీలక ప్రకటన చేశారు. EARAZA సభ్య సంస్థలకు ANTZ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జంతుప్రదర్శనశాలలు తమ దగ్గరున్న జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, నిర్వహణ వివరాలను భద్రపరచడంతో పాటు ఇతర సంస్థలతో సమాచారాన్ని పంచుకోవచ్చు.
ఈ సదస్సులో అమూర్ పులులు, ఓరియంటల్ స్టార్క్, అరుదైన గుడ్లగూబలు వంటి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతుల సంరక్షణపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. అలాగే మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడం, జంతువులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వన్యప్రాణులను రక్షించడం వంటి అంశాలపైనా నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎలిఫెంట్ డాక్టర్‌గా పేరుగాంచిన డాక్టర్ కె.కె. శర్మ కూడా ఏనుగుల సంరక్షణకు సంబంధించిన విషయాలను వివరించారు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం కొత్త పరికరాలు
మరోవైపు వన్యప్రాణుల సంరక్షణలో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు. ఏడు దేశాలకు చెందిన 13 సంస్థలు తమ కొత్త పరికరాలు, సాంకేతికతలను పరిచయం చేస్తున్నాయి. ఇందులో వంటారా ప్రదర్శిస్తున్న Vespr అనే AI పరికరం పక్షులు, ఇతర జీవుల శబ్దాలను గుర్తించి వాటి జాతులను గుర్తించగలదు. Smart Egg Analysis ద్వారా పక్షుల గుడ్లలో పిండం అభివృద్ధి, గుండె చప్పుడును పరిశీలించవచ్చు. అలాగే NFC పరికరం ద్వారా జంతు సంరక్షకులు తమ రోజువారీ పనుల వివరాలను ఒక్క ట్యాప్‌తో నమోదు చేయవచ్చు. ఈ సాంకేతికతలు జంతువుల సంరక్షణను మరింత సులభతరం చేయనున్నాయి.
సదస్సు ముగింపు కార్యక్రమంలో వన్యప్రాణుల సంరక్షణ రంగంలో విశేష సేవలు అందించిన ఆరుగురికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందించనున్నారు. ఇందులో అంతర్జాతీయ నిపుణులతో పాటు.. భారతదేశానికి చెందిన సెంట్రల్ జూ అథారిటీ మాజీ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇండియన్ జూ ఇయర్ బుక్ 2026ను విడుదల చేసారు.


