కోతి తీసిన సెల్ఫీ.. కోర్టుకెక్కిన కేసు! అసలేం జరిగిందంటే? | Funday Legal Story On Monkey Selfie Naruto Copyright Case Peta | Sakshi
Sakshi News home page

కోతి తీసిన సెల్ఫీ.. కోర్టుకెక్కిన కేసు! అసలేం జరిగిందంటే?

Oct 4 2026 9:18 AM | Updated on Oct 4 2026 9:18 AM

Funday Legal Story On Monkey Selfie Naruto Copyright Case Peta

ఫండే

వింతలు విశేషాలు

కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుందో  కానీ, కెమెరా దొరగ్గానే మాత్రం స్టైల్‌గా  ఫోజిచ్చింది. బటన్‌ నొక్కి కిసిక్కని సెల్ఫీ తీసుకుంది. సొంతంగా సోషల్‌ మీడియాలో పెట్టలేకపోయినా, ఆ ఫొటో మాత్రం వైరల్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా పాపులార్టీ పొందింది.

అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఫొటో తీసుకున్న కోతికే కాపీరైట్‌ హక్కు ఉంటుందని ఓ సంస్థ వాదించింది.  ఆ హక్కు ఫొటో తీసుకున్న కోతిదా? కెమెరా యజమానిదా? ఈ ప్రశ్నే చివరికి అమెరికా ఫెడరల్‌ కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కోతికి కాపీరైట్‌ హక్కు ఉందా? లేదా? అని  కోర్టు తేల్చింది.  చివరికి ‘రాజీ’తో ఈ వివాదానికి తెరపడింది.

ఆ ఫొటో ఎలా తీసింది?
డేవిడ్‌ స్లేటర్‌ ఫొటోగ్రాఫర్‌. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఉన్న రక్షిత అటవీప్రాంతంలో నివసించే క్రెస్టెడ్‌ బ్లాక్‌ మకాక్‌ కోతుల ఫొటోలు తీయాలనుకున్నాడు. అయితే కెమెరాను, డేవిడ్‌ను చూసి ఆ కోతులు బెదిరిపోతున్నాయి. దీంతో ట్రైపాడ్‌పై కెమెరాను పెట్టి ఆటోఫోకస్, ఫ్లాష్‌ ఏర్పాటు చేశాడు. కోతులు ఆ కెమెరాను పరిశీలించేలా వాటిని ఉంచి అతను దూరంగా వెళ్లాడు. కొద్దిసేపటికి ఆ కోతులు అక్కడికి వచ్చి ఆ కెమెరాను పరిశీలించడం మొదలు పెట్టాయి. ఓ కోతి కెమెరా దగ్గరకు వెళ్లి లెన్స్‌లోకి నేరుగా చూస్తూ షట్టర్‌ బటన్‌ నొక్కింది. పళ్లు కనిపించేలా నవ్వుతూ ఉన్న ఓ కోతి సెల్ఫీ అలా వచ్చింది. ఈ సెల్ఫీ తీసుకున్న కోతి పేరు నరుటో.

ఆ ఫొటోలతో డేవిడ్‌ ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. ‘నరుటో’ ఆ ఫొటోలు స్వయంగా తీసుకుందని అందులో పేర్కొన్నాడు. వైల్డ్‌లైఫ్‌ పర్సనాలిటీస్‌ సంస్థ, ప్రచురణకర్తలకు ఆ ఫొటోలపై హక్కు కలిగి ఉన్నట్టు అందులో ముద్రించాడు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఫొటో తీసిన వ్యక్తికే దానిపై హక్కు ఉంటే, అది ‘నరుటో’కి వర్తిస్తుందా, లేదా అనేది అసలు సమస్యగా మారింది.

కేసు వేసిన ‘పెటా’
పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానీమల్స్‌(పెటా) ‘నరుటో’ తరపున ‘నెక్ట్స్‌ ఫ్రెండ్‌’గా వ్యవహరిస్తూ కాపీరైట్‌ ఉల్లంఘన ఫిర్యాదు దాఖలు చేసింది. ‘నరుటో’ ఫొటోలు తీసింది కనుక కాపీరైట్‌ హక్కు ఆ కోతికే చెందుతుందని పేర్కొంది. ఆ ఫొటోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నరుటో’తో పాటు కోతుల నివాసప్రాంత రక్షణకు ఉపయోగించాలని కోరింది. పుస్తక ముద్రణ/ఆన్‌లైన్‌ ప్రచురణకు సంబంధించిన సంస్థలు అమెరికాకు చెందినవి.

వాటిపై కాపీరైట్‌కు సంబంధించిన అంశాలు అమెరికన్‌ కాపీరైట్‌ చట్టం కిందకు తీసుకురావడంతో కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ జిల్లా కోర్టులో ఈ కేసు దాఖలైంది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం కేసు వేసే హక్కు ‘పెటా’కు లేదని, కాపీరైట్‌ కింద చట్టబద్ధమైన హక్కు జంతువులకు వర్తించదని, అందువల్ల కేసు కొట్టేయాలని డేవిడ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. యూఎస్‌ కాపీరైట్‌ యాక్ట్‌ ప్రకారం మనుషులకు ఆ హక్కు ఇచ్చింది, కానీ జంతువులకు ఇవ్వలేదని పేర్కొంటూ ఫెడరల్‌ కోర్టు కేసు కొట్టేసింది.

అప్పీల్‌ కోర్టుకు  కేసు బదిలీ
ఫెడరల్‌ కోర్టు తీర్పుపై పెటా అప్పీలు దాఖలు చేయడంతో  నైన్త్‌ సర్క్యూట్‌ అప్పీల్‌ కోర్టుకు ఈ కేసు బదిలీ అయింది. యూఎస్‌ కాపీరైట్‌ యాక్ట్‌ ‘నరుటో’కి వర్తిస్తుందా? ‘నెక్ట్స్‌ ఫ్రెండ్‌’ కింద ‘నరుటో’ తరఫున కేసు దాఖలు చేసే హక్కు ‘పెటా’కు ఉందా? ఈ రెండు అంశాలు అప్పీలు కోర్టు పరిశీలించింది. ‘నరుటో’నే ఫొటో తీసి ఉండొచ్చు. అయితే, కాపీ రైట్‌పై జంతువులకు చట్టబద్ధ హక్కు లేదని ఫెడరల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్‌ కోర్టు సమర్థించింది.

నెక్ట్స్‌ ఫ్రెండ్‌ అర్హత ఉందా?
నెక్ట్స్‌ ఫ్రెండ్‌’ అంటే కోర్టులో కేసు దాఖలు చేయాల్సిన వ్యక్తి/జంతువు తన తరఫున తానే కేసు వేయలేని  స్థితిలో ఉంటే అతడు/ఆ జంతువు హక్కుల కోసం మరో వ్యక్తి లేదా సంస్థ కోర్టును ఆశ్రయించవచ్చు. వారి తరఫున కేసు దాఖలు చేయవచ్చు. ‘నరుటో’తో సన్నిహిత సంబంధం, వారి ప్రయోజనాలను నిజంగా కాపాడుతున్నట్టు చూపాల్సి ఉంటుంది. అయితే ‘పెటా’ ఇందుకు అవసరమైన ఆధారాలను చూపించలేకపోయింది. కావున ‘నెక్ట్స్‌ ఫ్రెండ్‌’గా ‘పెటా’కు అర్హత లేదని అప్పీల్‌ కోర్టు పేర్కొంది.

తీర్పుకు ముందే ఒప్పందం
అప్పీల్‌ కోర్టు తీర్పుకు ముందే డేవిడ్, పెటాకు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆ సెల్ఫీ ఫొటోలు ఉపయోగించడం, విక్రయించడం ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 25 శాతాన్ని ‘నరుటో’, ఇతర క్రిస్టె్టడ్‌ మకాక్‌ కోతుల సంక్షేమానికి లేదా అవి నివసించే ప్రాంత రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించాడు. కోర్టు తీర్పు ‘నరుటో’కు అనుకూలంగా రాకపోయినా, భవిష్యత్తు ఆదాయంలో కొంత భాగం వచ్చేలా ఒప్పందం కుదిరింది. ఫొటో రాయల్టీని కోతికి ఇప్పించడమే కాదు, జంతువులకు కూడా చట్టపరమైన హక్కులు ఉన్నాయని చాటి చెప్పడానికే తమ ప్రయత్నమని ‘పెటా’ ప్రతినిధులు పేర్కొన్నారు.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇదీ చదవండి: నోబెల్‌ ప్రైజ్‌.. రచయితల మధ్య మరో యుద్ధమా?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement