నోబెల్‌ ప్రైజ్‌.. రచయితల మధ్య మరో యుద్ధమా?! | Literature Story On Nobel Prize History Politics Jean Paul Sartre-2026 | Sakshi
Sakshi News home page

నోబెల్‌ ప్రైజ్‌ – విశేషాలూ, సశేషాలూ!

Oct 4 2026 8:36 AM | Updated on Oct 4 2026 8:37 AM

జ్షాన్‌ పాల్‌ సార్త్ర్‌, రబీంద్రనాథ్‌ టాగోర్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌

ఫండే

లిట్‌వరల్డ్‌

నోబెల్‌ సాహిత్య పురస్కార చరిత్రలో ప్రధాన దశలు నాలుగున్నాయని చెప్పొచ్చు. 1914 నుంచి ’18 వరకూ ఒకసారి, 1940 నుంచి ’43 వరకూ మరోసారి నోబెల్‌ సాహిత్య పురస్కార విజేతగా ఎవరినీ ప్రకటించనేలేదు స్వీడిష్‌ ఎకాడెమీ. రెండు ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో ఎకాడెమీ అలా నిర్ణయించింది.

ఇక రెండో ప్రపంచయుద్ధం తర్వాత, ప్రపంచమంతా రెండు ధ్రువాలుగా చీలిన సంగతి అందరికీ తెలిసిందే. దాన్నే ప్రచ్ఛన్న యుద్ధ దశగా ప్రపంచ చరిత్రలో చెప్తారు. ఆ దశలో, నోబెల్‌ సాహిత్య పురస్కారాలను సైతం ఈ ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావితం చేసింది. గోర్కియ్, మయాకఫ్సి్కయ్, ఎఫ్తుషెంకో, ఆన్న అఖ్మాతవ, చింగిజ్‌ ఐత్మతోఫ్‌ తదితర రష్యన్‌  మహారచయితలు ఎందరినో గుర్తించి గౌరవించలేదు స్వీడిష్‌ ఎకాడెమీ.

నోబెల్‌ సాహిత్య పురస్కార చరిత్రలో మొట్టమొదటిసారిగా, 1901లో, విజేతగా నిల్చిన సలీ ప్రూధాన్‌ ఫ్రెంచ్‌ కవులలో ‘ఛాందస‘(ప్యార్నేషియన్‌) వర్గానికి  చెందిన కవి. ఈ దశలో పురస్కారం అందుకున్న వారిలో ఛాందసేతర వర్గాలకు చెందిన ప్రముఖులెందరో వున్నారు.

రడ్యార్డ్‌ కిప్లింగ్‌ 1907లో, రబీంద్రనాథ్‌ టాగోర్‌ 1913లో, రోమా రోలా 1915లో, ఫ్రెంచ్‌ కథకుడు– నవలారచయిత అనతోల్‌ ఫ్రాన్స్‌ 1921లో, ఇంగ్లిష్‌ కవి డబ్ల్యూ.బీ.యేట్స్‌ 1923లో, బహుముఖ ప్రజ్ఞాశాలి జార్జ్‌ బెర్నార్డ్‌ షా 1925లో అమెరికన్‌ కథానిక రచయిత– నాటకకర్త– కవి సింక్లెయ్ర్‌ లూయీస్‌ 1930లో, బ్రిటిష్‌ నవలారచయిత– నాటకకర్త జాన్‌ గాల్స్‌ వర్దీ 1932లో, ప్రపంచ ప్రసిద్ధ ఇటాలియన్‌ కథానికా రచయిత– నవలాకారుడు– నాటకకర్త పిరాండెల్లో 1934లో, చైనా సామాజిక జీవనాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన అమెరికన్‌ నవలాకారిణి పర్ల్‌ బక్‌ 1938లో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన సంగతి చదువుకున్న వాళ్ళకు తెలిసిందే! వీళ్ళందరూ ఛాందసేతర వర్గానికి చెందినవారే.

‘సిద్ధార్థ’ లాంటి రచన ద్వారా ప్రపంచ ప్రసిద్ధుడైన హెర్మన్‌ హెస్స్‌ 1946లో, ఆధునిక కవితను మలుపుతిప్పిన టీ.ఎస్‌.ఇలియట్‌ 1948లో, హేతువాద ప్రవక్త–గణితశాస్త్రవేత్త బర్ట్రండ్‌ రసెల్‌ 1950లో, జిత్తులమారి రాజకీయవేత్తగానే కాకుండా ఉత్తమ రచయితగా కూడా ప్రసిద్ధుడైన విన్‌స్టన్‌ చర్చిల్‌ 1953లో, మనస్సముద్రంలో కలం ముంచి రాసిన ఎర్నెస్ట్‌ హెమింగ్వే 1954లో, నోబెల్‌ సాహిత్య పురస్కారం పొందిన ప్రముఖులు. వాళ్ళతో పాటుగా 1957లో అదే బహుమతి పొందిన అల్బర్ట్‌ కేమ్యూ, 1962లో అదే పురస్కారం గెల్చుకున్న జాన్‌ స్టెయిన్బెక్, 1969లో అదే పురస్కారం గెల్చుకున్న శామ్యూల్‌ బెకెట్‌ ప్రసిద్ధులు.

1971లో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన ప్యాబ్లో నెరూదా ‘చిలీ జాతీయ కవి‘గా సుప్రసిద్ధులు. 1978లో నోబెల్‌ ప్రైజ్‌ గెల్చిన ఇసాక్‌ బషేవిస్‌ సింగర్, 1982లో అదే ప్రైజ్‌ గెల్చిన గ్యాబ్రియెల్‌ గార్సియా మార్కెజ్‌ తదితరులు నోబెల్‌ సాహిత్య పురస్కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న రచయితలు.

కాలక్రమంతో సంబంధంలేని విశేషాలు మరికొన్ని వున్నాయి. 1933లో మొట్టమొదటిసారిగా నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్న రష్యన్‌ రచయిత ఇవాన్‌ బూనిన్‌. ఆయన సోవియెట్‌ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఇక ప్రచ్ఛన్న యుద్ధ దశలో– 1958లో– నోబెల్‌ ప్రైజ్‌ పొందిన కవి– నవలాకర్త– సంగీతవేత్త బోరిస్‌ పస్తర్నాక్‌ కూడా అదే బాపతు. మరో పుష్కరానికి –1970లో– అదే గౌరవానికి పాత్రుడైన అలెక్సాంద్ర్‌ సోల్జ్షి నిత్సిన్‌ కూడా అదే కోవకు చెందిన రచయిత. 1984లో నోబెల్‌ సాహిత్య పురస్కారం పొందిన చెకస్లవేకియన్‌ కవి యరస్లాఫ్‌ సైఫర్ట్‌ కూడా కమ్యూనిస్టు దేశాల్లో స్టాలినిస్టు ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన వాడు.

1977లో చెకస్లవాక్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ పాలనను వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన ప్రముఖుల్లో సైఫర్ట్‌ ఒకరు. అయితే, 1965లో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన రష్యన్‌ రచయిత మిహయీల్‌ షలఖోఫ్‌ మాత్రం పదిహేడేళ్ళ ప్రాయం మొదలుకొని 79వ యేట కన్నుమూసే వరకూ తాను కమ్యూనిస్టుననే చెప్పుకున్నారు. 1961లో నోబెల్‌ ప్రైజ్‌ పొందిన యుగోస్లావియన్‌ రచయిత ఇవో ఆంద్రిచ్‌ కూడా యుగోస్లావియన్‌ పాలకుడు యోసిప్‌ టిటో నాయకత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించిన వాడు కాదు. వీళ్ళకు దక్కిన నోబెల్‌ సాహిత్య పురస్కారాలు అటు సోషలిస్టు దేశాల్లోనూ, ఇటు పాశ్చాత్య ప్రపంచంలోనూ కూడా కల్లోలం కలిగించాయి.

అంతకు మించిన కల్లోలం కలిగించిన సందర్భం మరొకటి వుంది! 1964లో, ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడు– రచయిత –శాంతియోధుడు జ్షాన్‌ పాల్‌ సార్త్ర్‌ నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్టు ప్రకటించింది స్వీడిష్‌ ఎకాడెమీ. భిన్నధ్రువాలుగా చీలిన ప్రపంచ రాజ్యాల రాజకీయవిభేదాలను వ్యతిరేకించినవాడు సార్త్ర్‌. వాటిల్లో కొందరి కొమ్ము కాసే స్వీడిష్‌ ఎకాడెమీ ఇచ్చే పురస్కారం తీసుకునేందుకు సైతం ఆయన తిరస్కరించారు!  
ఈ యేడాది అక్టోబర్లో వెలువడే 2026 నోబెల్‌ సాహిత్య పురస్కారం వెలువరించగల విశేషాలు ఇప్పటికి సశేషాలు మాత్రమే!

- మందలపర్తి కిషోర్‌

ఇదీ చదవండి: దయ్యాల నౌకగా మారిన ‘మేరీ సెలెస్టే’.. నేటికీ అంతుచిక్కని మిస్టరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement