breaking news
jean paul sartre
-
నోబెల్ ప్రైజ్.. రచయితల మధ్య మరో యుద్ధమా?!
నోబెల్ సాహిత్య పురస్కార చరిత్రలో ప్రధాన దశలు నాలుగున్నాయని చెప్పొచ్చు. 1914 నుంచి ’18 వరకూ ఒకసారి, 1940 నుంచి ’43 వరకూ మరోసారి నోబెల్ సాహిత్య పురస్కార విజేతగా ఎవరినీ ప్రకటించనేలేదు స్వీడిష్ ఎకాడెమీ. రెండు ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో ఎకాడెమీ అలా నిర్ణయించింది.ఇక రెండో ప్రపంచయుద్ధం తర్వాత, ప్రపంచమంతా రెండు ధ్రువాలుగా చీలిన సంగతి అందరికీ తెలిసిందే. దాన్నే ప్రచ్ఛన్న యుద్ధ దశగా ప్రపంచ చరిత్రలో చెప్తారు. ఆ దశలో, నోబెల్ సాహిత్య పురస్కారాలను సైతం ఈ ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావితం చేసింది. గోర్కియ్, మయాకఫ్సి్కయ్, ఎఫ్తుషెంకో, ఆన్న అఖ్మాతవ, చింగిజ్ ఐత్మతోఫ్ తదితర రష్యన్ మహారచయితలు ఎందరినో గుర్తించి గౌరవించలేదు స్వీడిష్ ఎకాడెమీ.నోబెల్ సాహిత్య పురస్కార చరిత్రలో మొట్టమొదటిసారిగా, 1901లో, విజేతగా నిల్చిన సలీ ప్రూధాన్ ఫ్రెంచ్ కవులలో ‘ఛాందస‘(ప్యార్నేషియన్) వర్గానికి చెందిన కవి. ఈ దశలో పురస్కారం అందుకున్న వారిలో ఛాందసేతర వర్గాలకు చెందిన ప్రముఖులెందరో వున్నారు.రడ్యార్డ్ కిప్లింగ్ 1907లో, రబీంద్రనాథ్ టాగోర్ 1913లో, రోమా రోలా 1915లో, ఫ్రెంచ్ కథకుడు– నవలారచయిత అనతోల్ ఫ్రాన్స్ 1921లో, ఇంగ్లిష్ కవి డబ్ల్యూ.బీ.యేట్స్ 1923లో, బహుముఖ ప్రజ్ఞాశాలి జార్జ్ బెర్నార్డ్ షా 1925లో అమెరికన్ కథానిక రచయిత– నాటకకర్త– కవి సింక్లెయ్ర్ లూయీస్ 1930లో, బ్రిటిష్ నవలారచయిత– నాటకకర్త జాన్ గాల్స్ వర్దీ 1932లో, ప్రపంచ ప్రసిద్ధ ఇటాలియన్ కథానికా రచయిత– నవలాకారుడు– నాటకకర్త పిరాండెల్లో 1934లో, చైనా సామాజిక జీవనాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన అమెరికన్ నవలాకారిణి పర్ల్ బక్ 1938లో నోబెల్ ప్రైజ్ పొందిన సంగతి చదువుకున్న వాళ్ళకు తెలిసిందే! వీళ్ళందరూ ఛాందసేతర వర్గానికి చెందినవారే.‘సిద్ధార్థ’ లాంటి రచన ద్వారా ప్రపంచ ప్రసిద్ధుడైన హెర్మన్ హెస్స్ 1946లో, ఆధునిక కవితను మలుపుతిప్పిన టీ.ఎస్.ఇలియట్ 1948లో, హేతువాద ప్రవక్త–గణితశాస్త్రవేత్త బర్ట్రండ్ రసెల్ 1950లో, జిత్తులమారి రాజకీయవేత్తగానే కాకుండా ఉత్తమ రచయితగా కూడా ప్రసిద్ధుడైన విన్స్టన్ చర్చిల్ 1953లో, మనస్సముద్రంలో కలం ముంచి రాసిన ఎర్నెస్ట్ హెమింగ్వే 1954లో, నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన ప్రముఖులు. వాళ్ళతో పాటుగా 1957లో అదే బహుమతి పొందిన అల్బర్ట్ కేమ్యూ, 1962లో అదే పురస్కారం గెల్చుకున్న జాన్ స్టెయిన్బెక్, 1969లో అదే పురస్కారం గెల్చుకున్న శామ్యూల్ బెకెట్ ప్రసిద్ధులు.1971లో నోబెల్ ప్రైజ్ పొందిన ప్యాబ్లో నెరూదా ‘చిలీ జాతీయ కవి‘గా సుప్రసిద్ధులు. 1978లో నోబెల్ ప్రైజ్ గెల్చిన ఇసాక్ బషేవిస్ సింగర్, 1982లో అదే ప్రైజ్ గెల్చిన గ్యాబ్రియెల్ గార్సియా మార్కెజ్ తదితరులు నోబెల్ సాహిత్య పురస్కార చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న రచయితలు.కాలక్రమంతో సంబంధంలేని విశేషాలు మరికొన్ని వున్నాయి. 1933లో మొట్టమొదటిసారిగా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న రష్యన్ రచయిత ఇవాన్ బూనిన్. ఆయన సోవియెట్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఇక ప్రచ్ఛన్న యుద్ధ దశలో– 1958లో– నోబెల్ ప్రైజ్ పొందిన కవి– నవలాకర్త– సంగీతవేత్త బోరిస్ పస్తర్నాక్ కూడా అదే బాపతు. మరో పుష్కరానికి –1970లో– అదే గౌరవానికి పాత్రుడైన అలెక్సాంద్ర్ సోల్జ్షి నిత్సిన్ కూడా అదే కోవకు చెందిన రచయిత. 1984లో నోబెల్ సాహిత్య పురస్కారం పొందిన చెకస్లవేకియన్ కవి యరస్లాఫ్ సైఫర్ట్ కూడా కమ్యూనిస్టు దేశాల్లో స్టాలినిస్టు ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన వాడు.1977లో చెకస్లవాక్ సోషలిస్టు రిపబ్లిక్ పాలనను వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన ప్రముఖుల్లో సైఫర్ట్ ఒకరు. అయితే, 1965లో నోబెల్ ప్రైజ్ పొందిన రష్యన్ రచయిత మిహయీల్ షలఖోఫ్ మాత్రం పదిహేడేళ్ళ ప్రాయం మొదలుకొని 79వ యేట కన్నుమూసే వరకూ తాను కమ్యూనిస్టుననే చెప్పుకున్నారు. 1961లో నోబెల్ ప్రైజ్ పొందిన యుగోస్లావియన్ రచయిత ఇవో ఆంద్రిచ్ కూడా యుగోస్లావియన్ పాలకుడు యోసిప్ టిటో నాయకత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించిన వాడు కాదు. వీళ్ళకు దక్కిన నోబెల్ సాహిత్య పురస్కారాలు అటు సోషలిస్టు దేశాల్లోనూ, ఇటు పాశ్చాత్య ప్రపంచంలోనూ కూడా కల్లోలం కలిగించాయి.అంతకు మించిన కల్లోలం కలిగించిన సందర్భం మరొకటి వుంది! 1964లో, ప్రపంచ ప్రసిద్ధ తాత్త్వికుడు– రచయిత –శాంతియోధుడు జ్షాన్ పాల్ సార్త్ర్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్టు ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. భిన్నధ్రువాలుగా చీలిన ప్రపంచ రాజ్యాల రాజకీయవిభేదాలను వ్యతిరేకించినవాడు సార్త్ర్. వాటిల్లో కొందరి కొమ్ము కాసే స్వీడిష్ ఎకాడెమీ ఇచ్చే పురస్కారం తీసుకునేందుకు సైతం ఆయన తిరస్కరించారు! ఈ యేడాది అక్టోబర్లో వెలువడే 2026 నోబెల్ సాహిత్య పురస్కారం వెలువరించగల విశేషాలు ఇప్పటికి సశేషాలు మాత్రమే!- మందలపర్తి కిషోర్ఇదీ చదవండి: దయ్యాల నౌకగా మారిన ‘మేరీ సెలెస్టే’.. నేటికీ అంతుచిక్కని మిస్టరీ! -
సరళీకృత కథనాలు!
తాజా పుస్తకం ఈ కాలానికి పనికిరాని రచన మరే కాలానికి పనికిరాదు అన్న జీన్ పాల్ సర్త్ హితోక్తిని పరిగణనలోకి తీసుకుంటే ముందుగా ‘ఈ కాలం’ ఎటువంటిది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు, తుపానులు దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్నట్లే సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. వాటిని వెనక్కి మళ్లించడం సాధ్యం కాదని అందరూ అంగీకరిస్తోన్న నేపథ్యంలో వాటి పోకడలను అర్థం చేసుకోవడం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో జాన్సన్ చోరగుడి పుస్తకం ‘సొంత సంతకం’ పఠనీయం అవుతుంది. సాక్షి తదితర దినపత్రికల ఎడిట్ పేజీల్లో ప్రచురితమైన 80 వ్యాసాలను ఈ సంకలనంలో పొందుపరచారు. ఈ పుస్తకం ‘జాన్సన్’ సంతకమే అనడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ‘కృష్ణా-గోదావరి మండల మధ్యే’ కృష్ణాజిల్లాలో తాను పుట్టిన కోలవెన్ను గ్రామంలో నిల్చుని సరళీకృత వాతావరణాన్ని స్వానుభవంతో రిపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సరళీకృత విధానాలు అనుకుంటున్నవి ఎప్పుడూ వేర్వేరు పేర్లతో ఉన్నవేనని ‘నిన్న నుంచి పాఠకుడిని నేటి వరకూ తీసుకు వస్తారు’. రాజధానిలో సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ప్రవృత్తిరీత్యా నచ్చక రాజీనామా చేసి విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లి, ప్రస్తుతం సమాచార శాఖలో ఉన్నతోద్యోగిగా చేస్తోన్న జాన్సన్ చోరగుడి ఈ వ్యాసాలను సిద్ధాంతాల నుంచి రాయలేదు. తన జీవితం నుంచే పర్యావలోకన చేసి రాశారు. సంస్కరణలను పూర్తిగా వ్యతిరేకించేవారు ఉన్నా సంస్కరణల వలన అందుబాటులోకి రాగల అవకాశాలను అణగారిన వర్గాలు, ప్రాంతాలు, దేశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటారు జాన్సన్! సంస్కరణలు ఇచ్చే అవకాశాలను అందుకునే ఆలోచన చేయకుండా ముఖ్యంగా లెదర్ టెక్నాలజీ ఉపాధి అవకాశాలను మాదిగ యువత కాలదన్నుకుంటుందా అని ప్రశ్నిస్తూ, ఎ-బి-సి-డి చిక్కుల్లో కూరుకుపోతోన్న సోదరుల పట్ల ఆవేదన చెందుతారు. ‘ఆడవాళ్లను వ్యభిచారానికి పంపుతాం, తాగి మత్తులో పడుకుంటాం, మమ్మల్ని బాగు చేయడం మీ వల్లేమవుతుంద’న్న సమూహాలలో ‘వెలుగు’లు నిండిన వైనం, బార్డాన్సర్లు కోర్టులకెక్కి అనుమతులు తెచ్చుకున్న చైతన్యాన్ని, కులపరంగా జరిగిన అత్యాచారాలను ఎదుర్కోవడంలో సామాజిక సంస్థల ఉదాసీనతను, ఏ ప్రభుత్వ నివేదికలోనూ వెనకబడిన ప్రాంతంగా లేని అభివృద్ధి చెందిన జిల్లాల్లో సూక్ష్మరుణాల కారణంగా జరుగుతోన్న ఆత్మహత్యలను తనదైన దృష్టి కోణంలో పాఠకులకు చూపారు. ‘హరిజన వాడ’ పంచాయతీ రికార్డుల్లో అఫీసియల్గా వాడడం, ‘నాన్-బ్రాహ్మిన్’ అనేపదం పార్లమెంటులో అన్ పార్లమెంటరీగా పరిగణింపబడంలోని ఔచిత్యాన్నీ ఒక వ్యాసంలో ప్రశ్నిస్తారు. అంతేనా? ‘ఇజ్రాయిల్-పాలస్తీనాల పీటముడిని సడలించలేమా’ అనే వ్యాసం బహుశా మరెవరూ రాయలేనిది. శిశువు తండ్రిని పిలిచే తొలి పలుకు ‘అబా’. అబామీడియా ప్రచురణగా వెలువడిన జాన్సన్ వ్యాసాలు పాఠకుడిని తండ్రి స్థానంలో ఉంచి తన నివేదనను వినమని కోరుతున్నవిగా భావించవచ్చు. కాలచక్ర - 2006 ఉత్సవాలు జరిగాయి. 15 రోజుల ఉత్సవాలకు జాన్సన్ మీడియా ఆఫీసర్. ఇది మరెవరి మతమో అనుకున్న స్థానికుల గురించి, దలైలామా ఏమి చెబుతాడా అని చెవులు రిక్కించి విన్న విదేశీయుల గురించి, దలైలామాతో ఫొటోలు దిగి ఉడాయించిన మన వీఐపీల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. వృత్తి ప్రవృత్తిల పట్ల స్పష్టతకు ఈ వ్యాసాలు గీటురాళ్లు! - పున్నా కృష్ణమూర్తి సొంత సంతకం, జాన్సన్ చోరగుడి; వెల: రూ.250; కాపీలు: నవోదయ (abbamedia@gmail.com)


