breaking news
Monkey selfie case
-
కోతి తీసిన సెల్ఫీ.. కోర్టుకెక్కిన కేసు! అసలేం జరిగిందంటే?
కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుందో కానీ, కెమెరా దొరగ్గానే మాత్రం స్టైల్‌గా ఫోజిచ్చింది. బటన్ నొక్కి కిసిక్కని సెల్ఫీ తీసుకుంది. సొంతంగా సోషల్ మీడియాలో పెట్టలేకపోయినా, ఆ ఫొటో మాత్రం వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా పాపులార్టీ పొందింది.అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఫొటో తీసుకున్న కోతికే కాపీరైట్ హక్కు ఉంటుందని ఓ సంస్థ వాదించింది. ఆ హక్కు ఫొటో తీసుకున్న కోతిదా? కెమెరా యజమానిదా? ఈ ప్రశ్నే చివరికి అమెరికా ఫెడరల్ కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కోతికి కాపీరైట్ హక్కు ఉందా? లేదా? అని కోర్టు తేల్చింది. చివరికి ‘రాజీ’తో ఈ వివాదానికి తెరపడింది.ఆ ఫొటో ఎలా తీసింది?డేవిడ్ స్లేటర్ ఫొటోగ్రాఫర్. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఉన్న రక్షిత అటవీప్రాంతంలో నివసించే క్రెస్టెడ్ బ్లాక్ మకాక్ కోతుల ఫొటోలు తీయాలనుకున్నాడు. అయితే కెమెరాను, డేవిడ్‌ను చూసి ఆ కోతులు బెదిరిపోతున్నాయి. దీంతో ట్రైపాడ్‌పై కెమెరాను పెట్టి ఆటోఫోకస్, ఫ్లాష్ ఏర్పాటు చేశాడు. కోతులు ఆ కెమెరాను పరిశీలించేలా వాటిని ఉంచి అతను దూరంగా వెళ్లాడు. కొద్దిసేపటికి ఆ కోతులు అక్కడికి వచ్చి ఆ కెమెరాను పరిశీలించడం మొదలు పెట్టాయి. ఓ కోతి కెమెరా దగ్గరకు వెళ్లి లెన్స్‌లోకి నేరుగా చూస్తూ షట్టర్ బటన్ నొక్కింది. పళ్లు కనిపించేలా నవ్వుతూ ఉన్న ఓ కోతి సెల్ఫీ అలా వచ్చింది. ఈ సెల్ఫీ తీసుకున్న కోతి పేరు నరుటో.ఆ ఫొటోలతో డేవిడ్ ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. ‘నరుటో’ ఆ ఫొటోలు స్వయంగా తీసుకుందని అందులో పేర్కొన్నాడు. వైల్డ్‌లైఫ్ పర్సనాలిటీస్ సంస్థ, ప్రచురణకర్తలకు ఆ ఫొటోలపై హక్కు కలిగి ఉన్నట్టు అందులో ముద్రించాడు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఫొటో తీసిన వ్యక్తికే దానిపై హక్కు ఉంటే, అది ‘నరుటో’కి వర్తిస్తుందా, లేదా అనేది అసలు సమస్యగా మారింది.కేసు వేసిన ‘పెటా’పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానీమల్స్(పెటా) ‘నరుటో’ తరపున ‘నెక్ట్స్ ఫ్రెండ్’గా వ్యవహరిస్తూ కాపీరైట్ ఉల్లంఘన ఫిర్యాదు దాఖలు చేసింది. ‘నరుటో’ ఫొటోలు తీసింది కనుక కాపీరైట్ హక్కు ఆ కోతికే చెందుతుందని పేర్కొంది. ఆ ఫొటోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నరుటో’తో పాటు కోతుల నివాసప్రాంత రక్షణకు ఉపయోగించాలని కోరింది. పుస్తక ముద్రణ/ఆన్లైన్ ప్రచురణకు సంబంధించిన సంస్థలు అమెరికాకు చెందినవి.వాటిపై కాపీరైట్‌కు సంబంధించిన అంశాలు అమెరికన్ కాపీరైట్ చట్టం కిందకు తీసుకురావడంతో కాలిఫోర్నియాలోని ఫెడరల్ జిల్లా కోర్టులో ఈ కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేసు వేసే హక్కు ‘పెటా’కు లేదని, కాపీరైట్ కింద చట్టబద్ధమైన హక్కు జంతువులకు వర్తించదని, అందువల్ల కేసు కొట్టేయాలని డేవిడ్ పిటిషన్ దాఖలు చేశాడు. యూఎస్ కాపీరైట్ యాక్ట్ ప్రకారం మనుషులకు ఆ హక్కు ఇచ్చింది, కానీ జంతువులకు ఇవ్వలేదని పేర్కొంటూ ఫెడరల్ కోర్టు కేసు కొట్టేసింది.అప్పీల్ కోర్టుకు కేసు బదిలీఫెడరల్ కోర్టు తీర్పుపై పెటా అప్పీలు దాఖలు చేయడంతో నైన్త్ సర్క్యూట్ అప్పీల్ కోర్టుకు ఈ కేసు బదిలీ అయింది. యూఎస్ కాపీరైట్ యాక్ట్ ‘నరుటో’కి వర్తిస్తుందా? ‘నెక్ట్స్ ఫ్రెండ్’ కింద ‘నరుటో’ తరఫున కేసు దాఖలు చేసే హక్కు ‘పెటా’కు ఉందా? ఈ రెండు అంశాలు అప్పీలు కోర్టు పరిశీలించింది. ‘నరుటో’నే ఫొటో తీసి ఉండొచ్చు. అయితే, కాపీ రైట్‌పై జంతువులకు చట్టబద్ధ హక్కు లేదని ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.నెక్ట్స్ ఫ్రెండ్ అర్హత ఉందా?నెక్ట్స్ ఫ్రెండ్’ అంటే కోర్టులో కేసు దాఖలు చేయాల్సిన వ్యక్తి/జంతువు తన తరఫున తానే కేసు వేయలేని స్థితిలో ఉంటే అతడు/ఆ జంతువు హక్కుల కోసం మరో వ్యక్తి లేదా సంస్థ కోర్టును ఆశ్రయించవచ్చు. వారి తరఫున కేసు దాఖలు చేయవచ్చు. ‘నరుటో’తో సన్నిహిత సంబంధం, వారి ప్రయోజనాలను నిజంగా కాపాడుతున్నట్టు చూపాల్సి ఉంటుంది. అయితే ‘పెటా’ ఇందుకు అవసరమైన ఆధారాలను చూపించలేకపోయింది. కావున ‘నెక్ట్స్ ఫ్రెండ్’గా ‘పెటా’కు అర్హత లేదని అప్పీల్ కోర్టు పేర్కొంది.తీర్పుకు ముందే ఒప్పందంఅప్పీల్ కోర్టు తీర్పుకు ముందే డేవిడ్, పెటాకు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆ సెల్ఫీ ఫొటోలు ఉపయోగించడం, విక్రయించడం ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 25 శాతాన్ని ‘నరుటో’, ఇతర క్రిస్టె్టడ్ మకాక్ కోతుల సంక్షేమానికి లేదా అవి నివసించే ప్రాంత రక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించాడు. కోర్టు తీర్పు ‘నరుటో’కు అనుకూలంగా రాకపోయినా, భవిష్యత్తు ఆదాయంలో కొంత భాగం వచ్చేలా ఒప్పందం కుదిరింది. ఫొటో రాయల్టీని కోతికి ఇప్పించడమే కాదు, జంతువులకు కూడా చట్టపరమైన హక్కులు ఉన్నాయని చాటి చెప్పడానికే తమ ప్రయత్నమని ‘పెటా’ ప్రతినిధులు పేర్కొన్నారు.- దిలీప్ మాదిరెడ్డిఇదీ చదవండి: నోబెల్ ప్రైజ్.. రచయితల మధ్య మరో యుద్ధమా?! -
కోతికి సెల్ఫీపై కాపీరైట్ హక్కు లేదన్న కోర్టు
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాతోపాటు ప్రింట్ మీడియాలోను సంచలనం సృష్టించిన ‘మకాకు మంకీ’ సెల్ఫీ ఫొటోకు ఎవరికీ కాఫీరైట్ హక్కులు ఇవ్వలేమని అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టు బుధవారం తేల్చింది. నరుతో అని పిలిచే ఈ ఆరేళ్ల కోతి ఫొటోను ఇండోనేషియాలోని సులవేసిలో 2011లో బ్రిటన్‌కు చెందిన నేచర్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కెమెరాతో తీసినది. సులవేసిని డేవిడ్ సందర్శించినప్పుడు ఆయనకు ఈ మకాకు మంకీ కనిపించింది. దాన్ని దగ్గరి నుంచి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన ప్పుడు ఆ కోతి ఆయన కెమేరాను లాక్కొంది. అది తనకు తెలియకుండానే సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటోను ఓ వైల్డ్‌లైఫ్ మాగజైన్లో ప్రచురించినప్పుడు కోతి స్వయంగా తీసుకున్న సెల్ఫీ అని తెలిపారు. ఈ విషయం తెల్సిన ‘పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా)’ సంస్థ ఆ ఫొటోపై కాపీరైట్ హక్కులు ఆ కోతికే ఇవ్వాలంటూ శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ కోతి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఓ జంతువు తీసుకున్న సెల్ఫీ అంటూ ఆ ఫొటో మీడియాలో విస్తృతంగా పాపులర్ అయింది. పెటా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటరా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆ ఫొటోపై హక్కులు తాను పనిచేస్తున్న సంస్థ ‘వైల్డ్‌లైఫ్ పర్సనాలిటీస్ లిమిటెడ్’ కంపెనీకే ఉన్నాయంటూ వాదించారు. వాదోపవాదాల అనంతరం బుధవారం కోర్టు తీర్పును వెలువరించింది. అమెరికా చట్టాల ప్రకారం మానవులు సృష్టించిన వాటికే కాపీరైట్ హక్కులు ఉంటాయని, జంతువులకు ఉండవని జడ్జీ తేల్చారు. ఏడాది క్రితం వరకు మానవ సృష్టియా లేదా జంతువుల సృష్టియా అన్న వివరణ కాపీరైట్ చట్టంలో లేదు. గతేడాదే ఈ చట్టాన్ని సవరించి మానవ సృష్టికి మాత్రమే కాపీరైట్ హక్కులు వర్తిస్తాయనే నిబంధన తీసుకొచ్చారు.


