ప్రపంచవ్యాప్తంగా సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించే టెక్ ప్రముఖుడు, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు.. తాజాగా మరో కీలక అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భారత్‌లో సంప్రదాయ బిజినెస్ స్కూళ్లకు బదులుగా స్టార్టప్ ఇంక్యుబేటర్ల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. దేశానికి మరో తరం మేనేజ్‌మెంట్ పట్టభద్రుల కంటే సొంతంగా వ్యాపారాలు ప్రారంభించే పారిశ్రామికవేత్తలు అవసరం ఎక్కువుందని పేర్కొన్నారు. ఇందుకోసం బిజినెస్ స్కూళ్లను మూసివేసి, ఆ స్థానంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి? ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలి? అనే అంశాలను పుస్తకాల ద్వారా కాకుండా, స్వయంగా వ్యాపారాలు ప్రారంభించి, ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకునే అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన జడ్జి బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ క్రిస్ మార్క్విస్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకు స్పందిస్తూ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఓ బిజినెస్ స్కూల్‌లో బోధిస్తున్నాను. వాటిని మూసివేయాల్సిన సమయం వచ్చింది’ అని క్రిస్ మార్క్విస్ చేసిన వ్యాఖ్యకు శ్రీధర్ వెంబు మద్దతు తెలిపారు. తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. భారత్‌లో బిజినెస్ స్కూళ్లను మూసివేసి, స్టార్టప్ ఇంక్యుబేటర్లపై దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కొత్త స్టార్టప్‌లు ఏర్పడటంతోపాటు, వ్యాపార రంగంలో విస్తృత ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందని తన పోస్టులో వెల్లడించారు.
ఎంబీఏ విద్యపై చర్చ
వెంబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. భారత్‌లో ఇప్పటికే ఎంబీఏ పట్టభద్రులు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ, మొదటి నుంచి వ్యాపారాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చేవారి సంఖ్య తక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. దేశంలోని సగం బిజినెస్ స్కూళ్లను స్టార్టప్ ఇంక్యుబేటర్లుగా మార్చాలని సూచించారు. అటువంటి కేంద్రాల్లో ఔత్సాహికులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం, ఎదురుదెబ్బలను ఎదుర్కోవడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
అయితే, బిజినెస్ స్కూళ్లను పూర్తిగా మూసివేయాలన్న ప్రతిపాదనను మరికొందరు వ్యతిరేకించారు. సంప్రదాయ మేనేజ్‌మెంట్ విద్య, వ్యవస్థాపకత రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని వాదించారు. ఇప్పటికే ఉన్న బిజినెస్ స్కూళ్లలోనే స్టార్టప్ నిర్వహణ, వ్యాపార ఆవిష్కరణలు, నిధుల సమీకరణ వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వవచ్చని సూచించారు. ప్రస్తుతం అనేక ఎంబీఏ కోర్సులు అమ్మకాలు, నియామకాలు, అకౌంటింగ్ వంటి విభాగాలకే పరిమితమవుతున్నాయని, సొంతంగా సంస్థలను ఎలా స్థాపించాలి, వాటిని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలపై మరింత ప్రాక్టికల్ శిక్షణ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఇంత హాయి ఉద్యోగం వదులుకోవాలంటే కష్టమే మరి!!


