కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాలపై వ్యయాలు భారీగా పెరిగిపోతుండటం, సాఫ్ట్వేర్ పరిశ్రమలో అనిశ్చితి నెలకొనడంలాంటి అంశాల కారణంగా వార్షిక వేతనాల పెంపునకు ఈ ఏడాది విరామం ఇచ్చినట్లు దేశీ టెక్నాలజీ సంస్థ జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. అలాగే మార్కెటింగ్ వ్యయాలను కూడా తగ్గించుకున్నట్లు వివరించారు.
‘అంతర్జాతీయంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాల పరిస్థితి అంత ఆశావహంగా లేదు. సాఫ్ట్వేర్ వ్యాపార భవిష్యత్తు అనిశ్చితిగా ఉంది. ఏఐ వల్ల ఖర్చులు పెరిగిపోయాయి. డేటా సెంటర్లకు కావాల్సిన సర్వర్ల రేట్లు ఏకంగా 4 రెట్లు ఎగియడం, ఏఐ వినియోగం వేగంగా పెరగడం ఇందుకు కారణం. వీటిని కట్టడి చేసేందుకు మేము ప్రయతి్నస్తున్నాం. ఇక అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కూడా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి’ అని సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో చేసిన ఒక పోస్టులో ఆయన వివరించారు.
ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘మా కంపెనీలో మార్కెట్ బడ్జెట్ను కుదించుకున్నాం. అలాగే ఈ ఏడాది వేతనాల పెంపు ఉండదని ఉద్యోగులకు తెలియజేశాం. దీన్ని నివారించలేకపోవడంపై వారిని క్షమాపణలు కోరాను. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని శ్రీధర్ పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఉద్యోగాల కోతను నివారించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి అంత ఆశావహంగా కనిపించడం లేదని వివరించారు. తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఇది పని చేసిందా లేదా అనేది వచ్చే 3–5 ఏళ్లలో తెలుస్తుందన్నారు.
ఇదీ చదవండి: రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్


