రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్ | TVS Family Feud Lakshmi Sudarshan Wealth Split Hit by Unlisted Asset Valuations | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన టీవీఎస్ ఫ్యామిలీ వార్

Oct 13 2026 3:36 PM | Updated on Oct 13 2026 3:44 PM

TVS Family Feud Lakshmi Sudarshan Wealth Split Hit by Unlisted Asset Valuations

దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజమైన టీవీఎస్ గ్రూప్‌ కుటుంబంలో ఆస్తుల పంపిణీకి సంబంధించిన విభేదాలు రచ్చకెక్కాయి. సుదర్శన్ శ్రీనివాసన్, లక్ష్మీ వేణుల మధ్య ఆర్థిక యాజమాన్య హక్కుల విభజన ప్రక్రియ సజావుగా సాగడం లేదని స్పష్టమవుతోంది. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆర్థిక సమానత్వం, అన్-లిస్టెడ్ ఆస్తుల మూల్యాంకనం, పన్నుపరమైన చిక్కులు ఈ వివాదానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

పరిష్కారం కాని ఆర్థిక యాజమాన్య హక్కులు

మల్లికా శ్రీనివాసన్, డాక్టర్ లక్ష్మీ వేణు ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటనలో.. 2020లో టీవీఎస్ గ్రూప్ స్థాయి ప్రమోటర్ల మధ్య జరిగిన వ్యాపారాల విభజన ఒప్పందం వేరు, తమ కుటుంబ అంతర్గత ఆస్తుల పంపిణీ వేరని స్పష్టం చేశారు. కుటుంబ ఆస్తులన్నీ కేవలం ఒకే వ్యక్తికి చెందుతాయని, వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోగలరనే వాదన సరికాదని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ బాధ్యతలకు తగిన పారితోషికం లభించినప్పటికీ అసలైన ఆర్థిక ఆస్తుల పంపిణీ ఇప్పటికీ ముగింపునకు రాలేదని తెలిపారు.

వివాదం నేపథ్యం

టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ సుదర్శన్ వేణు, ఆయన సోదరి లక్ష్మీ వేణు మధ్య కుటుంబ ఆస్తుల పంపిణీ విషయంలో స్పష్టత కొరవడింది. ట్రస్ట్ నిర్మాణాలు, హోల్డింగ్ కంపెనీలలో తమకు తగిన సమాన ఆర్థిక హక్కులు రావాలని లక్ష్మీ వేణు పక్షం కోరుతుండగా, యాజమాన్య నియంత్రణకు సంబంధించి భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.

2024 మార్చిలో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కేవలం బ్రాండ్ వినియోగం, పోటీ వ్యాపారాలకు దూరంగా ఉండటం వంటి నిబంధనలకే పరిమితమైందని, అంతేకాని అది కుటుంబ సంపద లేదా ఆస్తుల ఆర్థిక పరిష్కారానికి సంబంధించిన ఒప్పందం కాదని లక్ష్మీ వేణు, తల్లి మల్లికా శ్రీనివాసన్ స్పష్టం చేయడంతో ఈ వివాదం బహిర్గతమైంది.

కంపెనీల విలువల్లో వ్యత్యాసం

టీవీఎస్ మోటార్స్, టీవీఎస్ హోల్డింగ్స్ వంటి సంస్థల మార్కెట్ విలువలు వేల కోట్లలో ఉండటం, భవిష్యత్ వారసత్వ ప్రణాళికలో భాగంగా ట్రస్టుల ద్వారా ప్రయోజనాలు ఒకరికే మెజారిటీగా దక్కేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ రావడంతో కుటుంబ ఆస్తుల సమాన పంపిణీ అంశం తెరపైకి వచ్చింది.

అన్-లిస్టెడ్ ఆస్తులు, పన్ను నిబంధనల చిక్కులు

లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువను సులభంగా నిర్ణయించగలిగినప్పటికీ కుటుంబానికి చెందిన పలు అన్-లిస్టెడ్ ఆస్తులు, హోల్డింగ్ కంపెనీల షేర్ల విలువను పారదర్శకంగా లెక్కించడం సవాలుగా మారింది. దీనితో పాటు, ఆస్తులు, షేర్ల బదిలీ సమయంలో ఎదురయ్యే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సంబంధిత చిక్కులు ఈ విభజన ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నించామని అయితే బయటకు వస్తున్న కథనాల దృష్ట్యా వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని లక్ష్మీ వేణు, మల్లికా శ్రీనివాసన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బంగారం.. ధరాభారం ఖతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement