ఏఐ విప్లవంతో మారనున్న ఉద్యోగాల స్వరూపం
ప్రపంచ ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఏఐ వేగంగా పునర్నిర్మిస్తోంది. ఈ సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపార వ్యూహాలను, పని విధానాలను పూర్తిస్థాయిలో మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా సంస్థను వీడే అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటించిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్(వీఈఓ) అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందిస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోవని తెలిపారు. అయితే వాటి స్వరూపం, నైపుణ్యాల అవసరాలు మారతాయని స్పష్టం చేశారు.
నాలుగు దేశాల్లో 60 వేల మందికి అవకాశం..
మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ అక్టోబర్ 26న అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ స్వచ్ఛంద నిష్క్రమణ పథకం భారత్‌తో పాటు అమెరికా, కెనడా, యూకేలోని ఎంపిక చేసిన విభాగాలకు వర్తిస్తుంది. సంస్థలో లెవల్ 70, అంతకంటే దిగువ స్థాయిలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఆయా విభాగాల వ్యాపార ప్రాధాన్యతలు, కస్టమర్ల అవసరాలను బట్టి అర్హతలను నిర్ణయించారు. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ పథకం కింద సంస్థను వీడేవారికి ఆర్థిక ప్యాకేజీతో పాటు తదుపరి కెరీర్ మార్గదర్శకత్వం అందించనున్నారు. సంస్థలోనే కొనసాగాలనుకునే వారికి అంతర్గతంగా కొత్త విభాగాల్లో అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు.
‘ఉద్యోగాలు పోవు.. వాటి తీరు మారుతుంది’
తాజాగా ప్రముఖ పాడ్‌కాస్ట్ ‘ది ప్రాగ్మాటిక్ ఇంజినీర్’లో పాల్గొన్న సత్య నాదెళ్ల ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహాన్ని వివరించారు. ‘భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ, గతంలో మాదిరిగా ఉండవు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో బృందాల పరిమాణం, బాధ్యతలు పూర్తిగా మారతాయి’ అని ఆయన పేర్కొన్నారు. విండోస్ వంటి సంప్రదాయ విభాగాలైనా, ఏఐ ట్రైనింగ్ వంటి ఆధునిక విభాగాలైనా.. సంస్థలోని దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ పనితీరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మార్పులకు అనుగుణంగా ఎదగని విభాగాల్లో ఉద్యోగులు చిక్కుకుపోకూడదన్నారు. ఆ ఉద్దేశంతోనే తమ దీర్ఘకాలిక ఆర్థిక, వృత్తిపరమైన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఈ పథకం ద్వారా కల్పించామని నాదెళ్ల తెలిపారు.
భారత ఐటీ నిపుణులకు కీలక సంకేతం
మైక్రోసాఫ్ట్ నిర్ణయాన్ని కేవలం ఉద్యోగుల కోతగా చూడలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత ప్రమాణాలు మారుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులు సంప్రదాయ నైపుణ్యాలకు పరిమితం కాకుండా ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పట్టు సాధించడం తక్షణ అవసరం. సాంకేతిక మార్పులను అందిపుచ్చుకునే వారికే భవిష్యత్తులో తిరుగులేని అవకాశాలు ఉంటాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: టీవీఎస్ ఆస్తుల వివాదం.. తండ్రికి నోటీసులు పంపిన కూతురు


