సమాఖ్య బిజినెస్ సమ్మిట్–2026 ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం, ఆది శ్రీనివాస్, లక్ష్మణ్, రఘురామ కృష్ణరాజు, గంటా శ్రీనివాసరావు, వీహెచ్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు
పెద్ద కంపెనీలకు సేవలందించే వారిగానే యువత మిగిలిపోకూడదు
సరికొత్త వ్యాపార ఆలోచనలతో స్టార్టప్స్‌ను స్థాపించాలి
స్కైరూట్ వంటి కంపెనీలు 10 రావాలి
సమాఖ్య బిజినెస్ సమ్మిట్– 2026లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎలాన్ మస్క్‌తో హైదరాబాద్ కంపెనీ స్కైరూట్ పోటీ పడుతోందని, మన ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే స్కై రూట్ ఏరోస్పేస్ వంటి కంపెనీలు 10 రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సరికొత్త వ్యాపార ఆలోచనలతో స్టార్టప్స్‌ను స్థాపించాలని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని యువతకు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు కేవలం సేవలు అందించే ఉద్యోగులుగానే కాకుండా, వాటిని సృష్టించే యజమానులుగా యువత ఎదగాలని ఆకాంక్షించారు.
హైటెక్స్‌లో బుధవారం ప్రారంభమైన సమాఖ్య బిజినెస్ సమ్మిట్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు. భారతీయ మూలాలున్న ఎందరో ప్రతిభావంతులు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారని, అయితే వారు వాటిని స్థాపించలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, ఎడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రముఖులు ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నారని, కానీ వారు ఆయా సంస్థల స్థాపకులు కాదని పేర్కొన్నారు. మన యువత కేవలం సేవా రంగాలకే పరిమితం కాకుండా, కొత్త ఆవిష్కరణలతో సొంత సంస్థల స్థాపన వైపు అడుగులు వేయాలని సూచించారు.
మహిళలకు సర్కారు ప్రోత్సాహం
‘రాష్ట్ర అభివృద్ధి కోసం మా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2034 నాటికి తెలంగాణను ఒక లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ప్రభుత్వ ప్రధాన ఆశయం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రస్తుతం తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉంది., దానిని 10 శాతానికి పెంచడమే మా లక్ష్యం. ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతి సాధించాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకం. అభివృద్ధి చెందిన దేశాలలో మహిళా కార్మిక శక్తి 50 శాతం కంటే ఎక్కువగా ఉంది.
మన దేశంలో ఆ సంఖ్య తక్కువగా ఉన్నందున మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు 67 లక్షల మంది సభ్యులతో కూడిన మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంక్ అనుసంధాన నిధులను ప్రభుత్వం కల్పించింది. ఈ సంఘాల మహిళలు సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, వాటిని ప్రభుత్వ రవాణా సంస్థకు అద్దెకు ఇచ్చేలా నూతన అవకాశాలను కల్పించాం. మహిళల నేతృత్వంలోని కంపెనీలు 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి..’అని సీఎం చెప్పారు.
గత ప్రభుత్వ మంచి పథకాలేవీ రద్దు చేయలేదు..
‘రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు ఉన్న ప్రభుత్వ విధానాలనే, తదుపరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పథకాలను, విధానాలను మా ప్రభుత్వం రద్దు చేయలేదు. పెట్టుబడిదారులకు అనుకూల విధానాల ద్వారా వారి పెట్టుబడులకు పూర్తి రక్షణ, సహకారం అందిస్తాం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ స్వప్నాన్ని సాకారం చేయడానికి అందరూ భాగస్వాములు కావాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు.
డిసెంబర్ 7–9 మధ్య జరిగే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హన్మంతరావు, ఎంపీ కె.లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


