సాక్షి, ఆదిలాబాద్: జాతీయ రహదారిపై కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. ఈ దృశ్యం స్థానికంగా కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం జవహర్‌నగర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు వివరాల ప్రకారం.. మెట్‌పల్లి నుంచి ఆదిలాబాద్‌లో జరిగే ఓ ఫంక్షన్‌కు దంపతులు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో గుడిహత్నూర్ సమీపానికి చేరుకోగానే కారు డిస్‌ప్లేలో ఎర్రర్ కనిపించింది. ఇంతలోనే కారులో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో వారు అప్రమత్తమయ్యారు.
అయితే, దంపతులిద్దరూ వెంటనే కారును ఆపి కిందకు దిగిపోయారు. కాసేపటికే కారులో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమై బూడిదైంది. దంపతులు సకాలంలో బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం... సాంకేతిక లోపమా? మరేదైనా సమస్యా? అనేదానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: బండ్లగూడ హత్య కేసులో ట్విస్ట్.. భార్యే సూత్రధారి


