ఏసీబీ అధికారులపైనే లంచం ఆరోపణలు.. శాఖలో కలకలం! | ACB Officer Bribery Allegations Telangana | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారులపైనే లంచం ఆరోపణలు.. శాఖలో కలకలం!

Nov 29 2026 10:34 AM | Updated on Nov 29 2026 11:25 AM

ACB Officer Bribery Allegations Telangana

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన టీజీపీడీసీఎల్‌ మాజీ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ ఎరుగు అంబేద్కర్‌ చేసిన తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తన కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌, డీఎస్పీ రూ.30 లక్షలు లంచం అడిగారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.

అయితే, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని సంబంధిత అధికారులు డిమాండ్‌ చేసినట్లు అంబేద్కర్‌ ఆరోపించారు. ఇప్పటికే రూ.5 లక్షలు తీసుకున్నారని, కేసులో బినామీగా పేర్కొన్న రాజేశ్‌ను తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో రికార్డింగ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అంతేకాకుండా, తనపై రాజకీయ కారణాలతోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. ఆయన ఇప్పటివరకు నిర్వహిస్తున్న కేసుల బాధ్యతలను మరో అధికారికి బదిలీ చేశారు. సంబంధిత అధికారిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ స్పందించారు. ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు. అలాగే విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఎంపీ సీఎం రమేష్‌ నివాసంలో రూ.18 లక్షలు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement