మనలో చాలామందికి ఏదో ఒక పనిలో.. అత్యుత్తమ నైపుణ్యం ఉంటుంది. కొందరికి వంట చేయడం బాగా తెలిసి ఉంటుంది. మరికొందరు మంచి సాఫ్ట్‌వేర్ డెవలపర్లు అయి ఉంటారు. ఇంకొందరు బేకరీ, సెలూన్ వంటి వ్యాపారాలకు సంబంధించిన పనుల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తుంటారు. అయితే.. ఒక పని బాగా చేయగలిగినంత మాత్రాన మంచి వ్యాపారవేత్త అయిపోలేరు. ఆ పనిని ఒక విజయవంతమైన బిజినెస్‌గా మార్చుకోవడం కూడా తెలియాలి. ఇదే విషయాన్ని రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెల్లడించారు.
వ్యాపారవేత్త కావాలంటే..
కియోసాకి ప్రకారం.. ఒక వ్యక్తి తన ప్రాంతంలోనే మంచి బ్రెడ్ తయారు చేయగలడని అనుకుందాం. అతని చేతి రుచి చాలా బాగుంటుంది. కస్టమర్లు కూడా అతని బ్రెడ్‌ను ఇష్టపడతారు. కానీ అంతమాత్రాన అతను మంచి బేకరీ వ్యాపారవేత్త అవుతాడని చెప్పలేం. ఎందుకంటే.. బ్రెడ్ తయారు చేయడం ఒక పని అయితే, బేకరీని విజయవంతంగా నడపడం మరో పని.
వ్యాపారవేత్త కావాలంటే.. కస్టమర్లను ఎలా పెంచుకోవాలి?, అమ్మకాలు ఎలా పెంచాలి?, ఉద్యోగులను ఎలా నిర్వహించాలి?, ఖర్చులను ఎలా తగ్గించాలి?, లాభాలను ఎలా పెంచుకోవాలి?, అనే విషయాలను కూడా తప్పకుండా తెలుసుకోవాలి.
కియోసాకి అనుభవం
ఈ విషయాన్ని మరింత అర్థమయ్యేలా వివరించడానికి కియోసాకి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పారు. ఒకసారి తనకు పరిచయం ఉన్న వ్యక్తి రెస్టారెంట్ ప్రారంభించడానికి 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలని కోరారట. ఆ వ్యక్తి సాధారణమైన చెఫ్ కాదు. ప్రపంచంలోని ప్రముఖ వంటకాల విద్యాసంస్థల్లో శిక్షణ పొందిన మంచి చెఫ్. వంట చేయడంలో అతనికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. అయినప్పటికీ కియోసాకి అతని రెస్టారెంట్‌లో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు.
దీనికి కారణం అతనికి వంట చేయడం బాగా వస్తుంది, కానీ బిజినెస్ నడపడం, ఉద్యోగులను నిర్వహించడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి విషయాల్లో సరైన అవగాహన లేదని కియోసాకి భావించారు. అతను తన టీమ్‌లో అందరికంటే మంచి చెఫ్‌గా ఉండాలని కోరుకున్నాడు. కానీ.. ఒక రెస్టారెంట్‌తో ఆగిపోకుండా మరిన్ని బ్రాంచ్‌లు ఎలా ప్రారంభించాలి? వ్యాపారాన్ని ఎలా పెంచాలి? అనే దానిపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదు.
కేవలం ఉద్యోగంపై ఆధారపడకు
అలాగే ఉద్యోగం చేస్తూ.. కేవలం జీతం మీద ఆధారపడటం కంటే సొంతంగా ఆదాయం తీసుకొచ్చే వ్యాపారాన్ని నిర్మించుకోవడం నేర్చుకోవాలని కియోసాకి సూచించారు. ఎందుకంటే కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరిగేకొద్దీ మనం సంపాదించే జీతం విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు.. కేవలం జీతం కోసం పనిచేయడం కాకుండా, మనకు ఆదాయం అందించే ఒక వ్యవస్థను నిర్మించుకోవడం ముఖ్యం. అంతేకాదు, ఉద్యోగాల కోసం వెతికే వ్యక్తులుగా కాకుండా.. మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
లక్షమంది వ్యాపారవేత్తల తయారీ
ఇక ఈ లక్ష్యంతోనే.. ఈ ఏడాది లక్ష మంది కొత్త వ్యాపారవేత్తలను తయారు చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కియోసాకి తెలిపారు. ఇందుకోసం విక్స్ (Wix) సంస్థతో భాగస్వామ్యం చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆన్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేయడంలో సహాయం అందిస్తామని చెప్పారు. సుమారు 30 నిమిషాల్లో 20 వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులతో ఆన్‌లైన్ స్టోర్‌ను సిద్ధం చేసుకోవచ్చని, ప్రారంభ ప్యాకేజీ ధర కేవలం 5 డాలర్లని వివరించారు.


