కోల్కతా: దక్షిణ కోల్కతాలోని ‘చేత్లా అగ్రణి’ మండపం వద్ద శనివారం సాయంత్రం ప్రమాదం త్రుటిలో తప్పింది. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతోందని గ్రహించిన నిర్వాహకులు సకాలంలో స్పందించి, మండపంలోకి ప్రవేశాన్ని నిలిపివేసి లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు పంపించారు. ఉత్తర కోల్కతాలోని చోర్బగాన్ విపత్తు జరిగిన కొద్దిసేపటికే చేత్లా అగ్రణి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. ముందుజాగ్రత్త చర్యగా తాలా ప్రత్తయ్, కాలేజ్ స్క్వేర్, ఎండీ అలీ పార్క్ తదితర ప్రధాన మండపాల వద్ద దుర్గా పూజలను నిలిపివేశారు. సంతోష్ మిత్రా స్క్వేర్, అలెన్ పార్క్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
శనివారం కురిసిన భారీ వర్షం కారణంగా మండపం లోపల ఒక్కసారిగా జనం భారీగా చేరుకున్నారని చేత్లా అగ్రణి మండపానికి చెందిన సబ్యసాచి చౌధురి తెలిపారు. ‘రద్దీని నియంత్రిస్తున్న వాలంటీర్లు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు పరిస్థితిని అంచనా వేసి ఖాళీ చేయించాలని ఆదేశించడంతో మేము వెంటనే అమలు చేశాం. నిష్క్రమణ ద్వారాలను తెరిచి, బారికేడ్లను తొలగించాము’ అని ఆయన చెప్పారు. అయితే ఎక్కడా పరిస్థితి తొక్కిసలాటగా మారేంత ప్రమాదం రాలేదని ఆయన స్పష్టం చేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రావడంతో చేత్లా అగ్రణి పండల్ను గతేడాది కూడా మూసివేయాల్సి వచ్చింది. అప్పట్లో మంటలను వెంటనే ఆర్పివేశారు.
పొరుగునే ఉన్న చోర్బగాన్లో జరిగిన ప్రాణనష్టానికి నివాళిగా ఎండీ అలీ పార్క్, కాలేజ్ స్క్వేర్ తమ పూజలను మూసివేయగా, మరింత ఉత్తరాన ఉన్న తాలా ప్రత్తయ్ కూడా తమ పండల్లోకి ప్రవేశాన్ని నిలిపివేసింది. తాలా ప్రత్తయ్ ప్రధాన నిర్వాహకుడు రితేష్ తివారీ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి సలహా మేరకు మేము మా పండల్ను మూసివేశాం. ఎందుకంటే ఇది తక్కువ వెలుతురు (డిమ్ లైట్స్) ఉండే థీమ్ ఆధారితంగా రూపొందించాం. మేము మా లైటింగ్, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలను పునఃసమీక్షిస్తాం. పోలీసులతో పాటు ఇతర సంబంధిత అధికారులతో రద్దీ నిర్వహణ సమీక్ష తర్వాతే భక్తుల కోసం మండపాన్ని తిరిగి తెరుస్తాం’ అని తెలిపారు.
మొదటిసారిగా దుర్గా పూజ నిర్వహిస్తున్న అలెన్ పార్క్ వద్ద నిర్వాహకులు లేజర్ షో, సంగీతాన్ని నిలిపివేశారు. అలెన్ పార్క్ దుర్గా పూజ ప్రధాన కార్యదర్శి నవీన్ మిశ్రా మాట్లాడుతూ ‘చోర్బగాన్ పూజ వద్ద జరిగిన మరణాలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. అందుకే మేము వేడుకలను తగ్గించాలని నిర్ణయించుకుని, సంగీతం, లేజర్ లైట్ షోను నిలిపివేశాం’ అని చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే సంతోష్ మిత్రా స్క్వేర్, సురుచి సంఘ వంటి ఇతర పూజా కమిటీలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అంచనా వేస్తున్నాయి. ‘మేము ప్రవేశ-నిష్క్రమణ ద్వారాలను విస్తరించాం. తక్కువ సంఖ్యలో ప్రజలను లోపలికి అనుమతించే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. ప్రభుత్వం ఏది నిర్దేశిస్తే అది చేస్తాం. మనిషి ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. మా మండపాన్ని మూసివేయాల్సి వచ్చినా పద్ధతి ప్రకారం మూసివేస్తాం’ అని సంతోష్ మిత్రా స్క్వేర్ పూజా ప్రతినిధి సజల్ ఘోష్ అన్నారు. చేత్లాలోని సురుచి సంఘ ప్రతినిధి సౌరవ్ సిక్దార్ మాట్లాడుతూ వాలంటీర్ల సంఖ్యను పెంచామని, విగ్రహం ముందు ఎక్కువ రద్దీ ఉండకుండా భక్తులను నిరంతరం ముందుకు సాగిపోవాలని కోరుతున్నామని తెలిపారు. ‘మాది చాలా విశాలమైన, బహిరంగ మండపం. కాబట్టి పూజను మూసివేయాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: శబరిమల, మాళికాపురం ఆలయాలకు నూతన అర్చకులు


